Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
ముచ్చటగా మూడోది
'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' సినిమాల తర్వాత నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల-నేను చేస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత 'ఇంటింటి రామాయణం', 'విద్య వాసుల అహం' రానున్నాయి. వీటితో పాటు మరో రెండు వెబ్ సిరీస్‌లు చేస్తున్నాను.
అరుదైన సందర్భం ఉన్న పాట
ఇటీవల విడుదలైన 'కనుల చాటు మేఘమా' పాటకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. నా కెరీర్లోఇది ఉత్తమ పాట అని చాలా గొప్పగా చెప్పగలను. ప్రేమలు చాలా రకాలుగా ఉంటాయి. ఇది మోహం లేని మధురమైన ప్రేమ. ఇటువంటి సందర్భంలో వచ్చిన ప్రేమ పాటను నేను ఇప్పటివరకు చేయలేదు. శ్రీనివాస్ అభిరుచికి తగ్గట్లుగా స్వరపరిచాను. కేవలం ట్యూన్ మాత్రమే కాదు.. లక్ష్మీభూపాల్ రాసిన లిరిక్స్, ఆభాస్ జోషి గాత్రం ఎంతో నచ్చాయి. ఈ పాట హిట్ అవ్వడంలో వాళ్ళ ప్రమేయం చాలా ఉంది.
హిట్‌కి తగ్గ అవకాశం రాలేదు
నా కెరీర్లో ఏ హిట్ వచ్చినా ఆ తర్వాత దానికి తగ్గ అవకాశం రాలేదు. 'ఆంధ్రుడు, ఐతే, అలా మొదలైంది, అష్టాచమ్మా..' ఇలా ఏ సినిమా తీసుకున్నా నేను ఊహించిన విధంగా కెరీర్ లేదు. అలాగే కమర్షియల్ సినిమాలు 'అధినాయకుడు, బాస్' సినిమాలు చేశాను. అవి ఆశించినస్థాయిలో ఆడలేదు. 2003లో నా మొదటి సినిమా 'ఐతే' విడుదలైంది. ఈ 20 ఏళ్లలో ఇది నా 19వ సినిమా. ఈ ప్రయాణంలో నా సంగీతం పట్ల ఎన్నో ప్రశంసలు దక్కాయి.
ఆస్కార్ వరకూ వెళ్ళడం గర్వంగా ఉంది
మా అన్నయ్య కీరవాణి స్వరపరిచిన 'నాటు నాటు' పాట ఆస్కార్ బరిలో నిలవడం చాలా గర్వంగా ఉంది. రాజమౌళికి తన సినిమా మీద, ఆ పాట మీద ఉన్న నమ్మకమే అక్కడి వరకు తీసుకెళ్లింది. నా సంగీతం, నా పాటలు బాగున్నాయి అని ప్రశంసలు దక్కాయి. నేను స్వరపరిచిన పాటలు పాడిన వారికీ అవార్డులూ వచ్చాయి. కానీ ఎందుకనో నాకు అవార్డులు రాలేదు. ఈ సినిమాకి లిరిక్ రైటర్‌గా లక్ష్మీభూపాల్, సింగర్‌గా ఆభాస్ జోషి అవార్డులు అందుకుంటారనే నమ్మకం ఉంది. అయితే అవార్డులు కంటే కూడా నా పాట బాగుందనే పేరే నాకు ఎక్కువ సంతప్తిని ఇస్తుంది.