Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని నటించిన పాన్ ఇండియా చిత్రం 'దసరా'. శ్రీకాంత్ ఒదెల దర్శకుడు. కీర్తి సురేష్ కథా నాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో దీనికి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసిన అవినాష్ కొల్లా మీడియాతో మాట్లాడుతూ, 'నానితో 'కృష్ణగాడి వీర ప్రేమగాథ, జర్సీ, శ్యామ్ సింగారారు సినిమాలు చేశాను. కానీ 'దసరా' కథా నేపథ్యం పూర్తిగా భిన్నమైనది. తెలంగాణలోకి ఒక ఊరికి సబంధించిన కల్చర్, అలవాట్లు, కట్టుబాట్లు ఉంటాయి. ఆ ఊరికి కోల్ మైన్ దగ్గరగా ఉండటం వలన పెద్దపెద్ద వాహనాలు ఆ ఊరి నుంచే వెళ్తాయి. దాని కారణంగా సహజంగానే రస్టిక్ టోన్ ఉంటుంది. దీని కోసం 22 ఎకరాల్లో అడవి లాంటి ఒక ఖాళీ ప్రదేశం తీసుకొని భారీ విలేజ్ సెట్ వేశాం. ఐదు వందల మంది నివసించే గ్రామాన్ని నేచురల్‌గా క్రియేట్ చేశాం. 98 శాతం షూటింగ్ సెట్లోనే జరిగింది. సెట్లో ప్రతి రోజు మూడు వందల మంది ఉండేవారు. ఫస్ట్ షెడ్యుల్ అయ్యేవరకూ అది సెట్ అని ఆ మూడు వందల మందికి తెలీదు. సెట్ మొత్తం రెడీ అయ్యాకా కరెంట్ బోర్డ్ వాళ్ళు వచ్చి బోర్డ్ లేకుండా కరెంట్ ఎలా వాడేస్తున్నారు? అని ప్రశ్నించారు. మాకు కరెంట్ అక్కర్లేదు.. జనరేటర్‌తో నడిపిస్తాం. ఇది సెట్ అని చెబితే ఎంతకీ నమ్మలేదు (నవ్వుతూ). దర్శకుడు శ్రీకాంత్‌ది తెలంగాణ నేపథ్యం. తన ఊరు గురించే కథ రాసుకున్నాడు. మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు. నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. ప్రస్తుతం రామ్ చరణ్, నాని 30, 'ఏజెంట్' సినిమాలు చేస్తున్నాను' అని తెలిపారు.