Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. 'మిథునం' వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన మొయిద ఆనందరావు (57) కన్నుమూశారు.డయాబెటిస్తో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా వైజాగ్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన ఆనందరావు వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. సంఘసేవకుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. అందుకే తన స్వగ్రామంలో రూ.25 లక్షలు ఖర్చు చేసి ఓ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. సాహిత్యంపై కూడా ఆయనకు మక్కువ ఎక్కువ. పర్యావరణ హిత పద్యాలను రాసి 'కోటిగాడు' పేరుతో ప్రచురించేవారు. ఇక సినిమాల విషయానికొస్తే 2012లో 'మిథునం' సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ కీలక పాత్రల్లో నటించారు. తనికెళ్ల భరణి ఈ చిత్రానికి దర్శకుడు. ప్రేక్షకులను, విమర్శకులను కూడా ఎంతగానో మెప్పించిన ఈ చిత్రానికి నంది అవార్డు కూడా లభించింది. ఆనందరావుకు భార్య పద్మినితో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నేడు (శుక్రవారం) ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు సన్నిహితులు చెప్పారు.