Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు విశ్వక్ సేన్ కొత్త సినిమా ఆదివారం ఆరంభమైంది. ఇది ఆయన 10వ సినిమా. ఈ సినిమాని ఆయన నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడితో చేస్తున్నారు. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రామ్ తాళ్లూరి భార్య రజనీ క్లాప్ ఇవ్వగా, రచయిత, దర్శకుడు మచ్చ రవి కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు రవితేజ ముళ్లపూడి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. నిర్మాత రామ్ తాళ్లూరి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ,'రామ్ తాళ్లూరి నా ఫేవరేట్ ప్రొడ్యూసర్. ఇది నా పదో చిత్రం. ఇది కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడుతున్నాం. కొత్త దర్శకుడు రవితేజ చాలా టాలెంటెడ్. సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుంది' అని అన్నారు.'నన్ను నమ్మి సినిమా ఇచ్చిన విశ్వక్ సేన్‌కి, నిర్మాతకి కృతజ్ఞతలు' అని దర్శకుడు రవితేజ చెప్పారు. నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ, 'ఈ సినిమా ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు తగ్గకుండా ఉంటుంది' అని చెప్పారు.