Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాజల్ అగర్వాల్, రాధిక శరత్ కుమార్, యోగిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన సినిమా 'కోస్టి'. గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. ఉగాది సందర్భంగా ఈ నెల 22న తెలుగు ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు వస్తోంది. కళ్యాణ్ దర్శకుడు. ప్రభుదేవా 'గులేబకావళి', జ్యోతిక 'జాక్ పాట్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆయన ఆకట్టుకున్నారు. హారర్ కామెడీగా 'కోస్టి' తెరకెక్కింది. ఇందులో తండ్రి కుమార్తె మధ్య అనుబంధాన్ని కూడా చూపించారు.
ఆరతి పాత్రలో కాజల్ అగర్వాల్, గ్యాంగ్‌స్టర్ దాస్‌గా దర్శకుడు కెఎస్ రవికుమార్ చేశారు. పోలీస్ కథకు, దర్శకుడు కావాలని ప్రయత్నించే యోగిబాబు పాత్రకు సంబంధం ఏమిటి? అనేది ఆసక్తికరం. సినిమాలో రిడిన్ కింగ్ స్లే, తంగదొరై, జగన్, ఊర్వశి, సత్యన్, ఆడు కాలం నరేన్, మనోబాల, రాజేంద్రన్, సంతాన భారతి, దేవదర్శిని వంటి భారీ తారాగణం ఉంది. గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మాట్లాడుతూ, 'ఇందులో హారర్, కామెడీతో పాటు థ్రిల్ ఇచ్చే అంశాలు ఉన్నాయి. ప్రేక్షకులు ఉలిక్కిపడి సన్నివేశాలు ఉన్నాయి. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రను కాజల్ అగర్వాల్ పోషించారు. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన యంగ్ తమిళ హీరో అతిథి పాత్రలో కనిపిస్తారు. ఆయన క్యారెక్టర్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంది. సామ్ సిఎస్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ' అని తెలిపారు.