Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గండిపేట్ : ప్రజా కార్మిక వ్యతిరేక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. సోమవారం గండిపేట్ మండల నార్సింగి ప్రధాన చౌరస్తాలో సీఐటీయూ, మున్సిపల్ కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహర దీక్షల్లో పాల్గొన్నారు. బండ్లగూడ, నార్సింగి, మణికొండ మున్సిపల్ కార్మికులు కూడా దీక్షల్లో పాల్గొన్నారు. వీరయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాలను వేంటనే రద్దు చేయాలన్నారు. లేబర్ కోడ్‌తో పాటు విద్యుత్ చట్ట సవరణలు ఆపాలన్నారు. కార్మికులు, రైతుల వ్యవసాయ కూలీల హక్కులను కాలరాయడం దారుణమన్నారు. కార్మికులందరికీ రూ.24 వేల వేతనం ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులకు 11 పీఆర్సీ ప్రకారం రూ.19 వేలు చెల్లించాలన్నారు. నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కన్వీనర్ రుద్రకుమార్, నార్సింగి మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు మైహిపాల్, కార్యదర్శి జనార్దన్, మున్సిపల్ యూనియన్ సభ్యులు పాండు, హైమద్, రాహుల్, శంశీ, చందు, శ్రీకాంత్, బొట్టు శ్రీను, పోచయ్య, వెంకటేష్, నర్సింహులు, జంగయ్య, వసంత, దుర్గమ్మ, సాలమ్మ, జయమ్మ, పోచమ్మ, సత్యమ్మ, రమాదేవి, నవీన్, యాదగిరి, సలహాదారులు సురేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.
రాజేంద్రనగర్ : కేంద్రం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ అన్నారు. సోమవారం కాటేదాన్‌లో క్లస్టర్ కన్వీనర్ రుద్ర కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని అన్నారు. 44 కార్మిక చట్టాలను పెరిగిన ధరలకు అనుగుణంగా మార్చకుండా చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్ గా మార్చి కార్మికులను శ్రమదోపిడీకి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్య రంగానికి నిధులు పెంచాలి, ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేయాలన్నారు. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సు ప్రకారం కనీస వేతనం రూ.21 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గట్టయ్య, తాటిపాముల వెంకటేష్ గౌడ్, శ్రామిక మహిళా నాయకురాలు యాదమ్మ, కేతమ్మ, సువార్త, హైమావతి, సుజాత, ఈశ్వరి, లావణ్య, సౌభాగ్య, మమత, మేరీ, ఇండిస్టియల్, కార్మికులు వెంకట్ రమణ, ప్రవీణ్, సచిన్, శివ, రమేష్ పాల్గొన్నారు.
మియాపూర్ : చందానగర్ గాంధీ సర్కిల్ దగ్గర చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి కార్యదర్శి వర్గ సభ్యులు చంద్రమోహన్, ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తుకారాం నాయక్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడిచినా రైతులకు, కార్మికులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదన్నారు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తూ వారిని ఇబ్బందులుకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కార్మిక, కర్షకుల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మిక విద్యార్థి యువజన మహిళా సంఘాల నాయకులు కష్ణ, మధు, అంగడి పుష్ప, మురళి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు : ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు కునపాటి రమేష్, రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి బి సాయిబాబు అన్నారు. భారత రక్షణ దినం పురస్కరించుకొని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కమిటీ పిలుపు మేరకు సాయిబాబు ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో సత్యాగ్రహ దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు కూనపాటి రమేష్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ప్రజావ్యతిరేక చట్టాలను అమల్లోకి తెచ్చిందన్నారు. అనంతరం యూటీఎఫ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్, కార్యదర్శి భూపాల్, సత్యనారాయణ, బాలకృష్ణ, ఆశాకార్యకర్తలు అనిత, మాధవి, బుజ్జి, వసంత, చైతన్య, నీరజ, మాధవి, చిట్టి నిర్మల, మహేశ్వరి తదితరులు సీఐటీయూ సత్యాగ్రహ దీక్షలు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాట్కో ప్రధాన కార్యదర్శి ఎన్. మల్లేష్, నాయకులు రమేష్, సత్యనారాయణ రెడ్డి, రెడ్యానాయక్, కోటేశ్వరరావు, వై సత్యంరెడ్డి పాల్గొన్నారు.
తాండూరు : క్విట్ ఇండియా స్ఫూర్తితో మోడీ విధానాలను ప్రతిఘటించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో పీపీ యూనిట్ ఆసుపత్రి దగ్గర దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా సీఐటీయూ కార్మిక సంఘాల పిలుపుమేరకు ఆశా కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశావర్కర్లకు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అన్నారు. వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ప్రజాసంఘాల నాయకులు మహేష్, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు రాజమణి, సుజాత, లక్ష్మి, రమాదేవి, అరుణ, యాదమ్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.