Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోమిన్‌పేట
పాఠశాలకు వెళ్లాలని ఓ విద్యార్థి ఇంటి నుంచి బయలుదేరాడు. బస్ కోసం బస్టాండ్‌లో చాలా సేపు ఎదురుచూశాడు. ఎంతకీ బస్సు రాకపోవడంతో పాఠశాలకు వెళ్లాలనే ఆతృతో తెలిసిన వ్యక్తిని ఆటో ఎక్కాడు. ఆ ఆటోనే తన ప్రాణాలు బలిగొంటుందని ఆ విద్యార్థి ఊహించలేకపోయాడు. చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. డ్రైవర్ అజాగ్రత్తతో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారకర ఘటన కేసారం గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మర్పల్లి మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన డప్పు నగేష్ (16) పరిగిలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం స్కూల్‌కి వెళ్తానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. రావులపల్లి బస్టాండ్ దగ్గర చాలా సేపు వెయిట్ చేయగా బస్సులు టైంకు రాకపోవడంతో అదే గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి ట్రాలీ ఆటో ఎక్కి మోమిన్ పేటకు బయలుదేరాడు. మార్గమధ్యంలో కేసారం గ్రామ సమీపంకు రాగానే మూల మలుపు దగ్గర ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగం, అజాగ్రత్త వలన ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో ట్రాలీలో ఉన్న డప్పు నగేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి డప్పు అమృత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శేఖర్ గౌడ్ తెలిపారు.