Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాద్ నగర్ రూరల్
ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని దేవునిబండా తండా గ్రామంలో కొమురం భీమ్ భవనం ఆవరణలో గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కన్వీనర్ శ్రీనునాయక్ గిరిజన సంఘం జెండాను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా గిరిజన తెగలు యేటా ఆగస్టు 9న ప్రపంచ గిరిజన హక్కుల దినంగా జరుపుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వాల వైఫల్యం కారణంగా 30 ఏండ్లలో గిరిజన తెగల పరిస్థితి మరింత అధ్వానంగా మారిందన్నారు. హక్కుల పై దాడులు పెరిగాయని, అభివద్ధి సంక్షేమం సాధికారతను సాధించడంలో పూర్తిగా విఫలం అవుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. అడవులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజన తెగలను అభివద్ధి ముసుగులో బలవంతంగా గెంటి వేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ వ్యవస్థలకు కట్టబెట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు 16 రకాల వాగ్దానం చేసిందని, తండాలను పంచాయతీలుగా మార్చడం మినహా మిగిలిన ఏవీ అమలు కాలేదని అన్నారు. ఇప్పటికైనా హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం నాయకులు ఈశ్వర్ నాయక్, రమేశ్ నాయక్ శ్రీనివాస్ నాయక్, ఇచ్చియ నాయక్, దశరథ్ నాయక్, లక్ష్మి, కమ్లి, మారు పాల్గొన్నారు.