Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
తెలంగాణ రాష్ట్రంలో పేద బీసీల కోసం ఎంబీసీ బంధు పథకం ప్రకటించాలని తెలంగాణ ఎంబీసీ సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెక్కం వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బెక్కం వెంకట్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన బీసీలు ఆది నుండి నేటి వరకు వివక్షకు గురవుతూ రాజ్యాధికారానికి దూరమవుతున్నారని తెలిపారు. అందులో ఎంబీసీ సంచార కులాలకు సంబంధించిన చాలా కులాలు వెనుకబాటుతనంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ దళితులను ఆదుకుంటున్నట్టే వెనుకబడిన కులాలు, సంచార కులాలకు ఎంబీసీ బంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధును కూడా రాష్ట్రమంతా అమలు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన బడుగు బలహీన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పది లక్షల రూపాయలు ఆర్థిక సాయంగా అందించడమే కాకుండా మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలకు నామినేటెడ్ పోస్టుల్లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.