Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంపుతామంటూ భూకబ్జాదారులకు బెదిరింపులు
- సీబీఐ దర్యాప్తు చేయాలంటూ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
నవతెలంగాణ- మర్పల్లి
తాతల కాలం నుంచి వందేండ్లుగా భూమిని నమ్ముకొని పంటలు పండించి జీవనం కొనసాగిస్తున్న తమకు తెలియకుండానే భూమిని కొన్నట్లు దొంగ సంతకాలతో కొందరు కబ్జాచేశారని పట్లూరు రైతులు అన్నారు. పైగా తమను చంపుతామని బెదిరిస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించి తమకు న్యాయం చేయాలని రైతులు గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రైతులు మాట్లాడుతూ మర్పల్లి మండల పరిధిలోని పట్లూర్‌లో సర్వే నంబర్ 230, 231లో 30 ఎకరాల భూమిని తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. దేశ్‌ముఖ్‌లకు చెందిన ఆ భూమి దేశ విభజనలో పాకిస్థాన్‌కు వెళ్లిపోవడంతో అప్పటినుండి భూమిని సాగు చేస్తున్నామన్నారు. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వమూ తమకు పట్టా పాసుబుక్కులు ఇవ్వలేదన్నారు. కొందరు తమకు తెలియకుండానే అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని మండిపడ్డారు. కొందరు రైతులు పోలీసు కేసులు పెడితే చంపుతామని బెదిరించి, లక్షా, రెండు లక్షలు ఇచ్చి బలవంతంగా కబ్జా చేసుకుంటున్నారని ఆరోపించారు. భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో కొందరు పట్టణాల నుండి వచ్చి గ్రామ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు డబ్బు ఆశజూపి దొంగ సంతకాలు పెట్టి ఒకరి భూమిని మరొకరిపై మార్చుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సీబీఐ విచారణ జరిపి తమకు పట్టా పాస్‌బుక్కులు ఇప్పించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవికుమార్, ఈశ్వర్ రైతులు, మొగులయ్య కుమార్, రమేష్, శ్రీశైలం, ప్రసాద్, శ్రీకాంత్ పాల్గొన్నారు.