Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మున్సిపల్లో గత రెండేండ్ల నుంచి ఇన్‌చార్జిలతోనే పనులు కొనసాగుతున్నాయి. రెగ్యులర్ అధికారులు లేకపోవడం వల్ల పనులలో కొంత జాప్యం జరుగుతోందని మున్సిపల్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద శంకర్పల్లి గ్రామపంచాయతీ ఉండగా శంకర్‌పల్లితో పాటు బుల్కాపురం, సింగాపురం, రామంతాపురం, పత్తేపురం గ్రామాలను కలిపి శంకర్పల్లి మున్సిపల్‌గా ఆగస్టు 2018లో ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటివరకు మున్సిపల్ సంబంధించిన అధికారులు గానీ, సిబ్బంది గానీ పూర్తిస్థాయిలో నియమించలేదు. పూర్తిస్థాయి అవుట్సోర్సింగ్ ఉద్యోగులతోనే మున్సిపల్ కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి లేకపోవడంవల్ల శంకర్పల్లి మున్సిపల్లో ఇష్టానుసారంగా కొందరు గృహ నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. పటాన్చెరువు జీహెచ్ఎంసీలో ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో శంకర్‌పల్లిలో పూర్తి బాధ్యతలు నిర్వహించలేకపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి స్వామినాయక్ శంకర్పల్లి మున్సిపల్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కానీ శంకర్పల్లి మున్సిపల్‌కు ఎప్పుడొచ్చిన దాఖలాలు లేవని పలువురు విమర్శిస్తున్నారు. ఈ వారంలో ఏకంగా చైర్పర్సన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకూ శంకర్పల్లి అభివృద్ధి చెందుతుంటే పూర్తిస్థాయిలో అధికారులు లేకపోవడంతో మున్సిపల్‌కు వచ్చే ఆదాయం కూడా రావడం లేదని పలువురు వాపోతున్నారు. ఈ మున్సిపల్లో 9 రెగ్యులర్ ఉద్యోగ పోస్టులు ఖాళీలు ఉండటం గమనార్హం. టౌన్ ప్లానింగ్ అధికారి పోస్టు, ఏఈ పోస్టు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, వర్క్ ఇన్స్పెక్టర్, మేనేజర్, ఆర్వో, శానిటేషన్ ఇన్స్పెక్టర్, చైన్మెన్స్ ఇద్దరు, జేఏవో ఖాళీలు ఉన్నాయని సమాచారం. ఇన్ని పోస్టులు ఖాళీ ఉండటంవల్ల పనులు ఎలా జరుగుతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారి తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శంకర్పల్లి పట్టణంలో నిర్మాణాల విషయంలో ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ సమస్య ఇలా ఉంటే స్థానికంగా మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారి పోస్టులు ఖాళీ ఉండటం దానితో నూతనంగా ఏర్పడిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఇన్చార్జిగా కొనసాగుతుండటం మరింత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది.అక్రమ నిర్మాణాలపై, అక్రమ లేఅవుట్లపై పరిశీలించాలన్నా, మరింత వేగంగా గృహ నిర్మాణ అనుమతులు రావాలన్నా, పట్టణ పరిధిలోని టౌన్ ప్లానింగ్ అధికారి రెగ్యులర్‌గా ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. అందువల్ల శంకర్పల్లి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి పూర్తి బాధ్యతలతో నియమించాలని పలువురు కోరుతున్నారు.