Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
భారత స్వాతంత్య్రోద్యమం, అలాగే హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమర యోధులపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్రీచ్ బ్యూరో (ఆర్.ఒ.బి.) ఆధ్వర్యంలో మాదాపూర్ శిల్పారామం(హైదరాబాద్)లో ఆగస్టు 13 నుంచి 17 వరకు ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. విదేశీ పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలు, పూర్వ హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడానికి ప్రముఖుల కృషిని ప్రస్తుత తరానికి తెలియజేయడమే ఈ ఫోటో ఎగ్జిబిషన్ లక్ష్యం. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్ లో భాగంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. ఈ ఎగ్జిబిషన్లో కుమురం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్థ, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు తదితరుల పాత్రను ఈ ఫోటోలు ప్రస్తుత తరానికి క్లుప్తంగా వివరిస్తాయి. మాదాపూర్ శిల్పారామం సహకారంతో ఏర్పాటుచేసిన ఈ ఎగ్జిబిషన్లో 30 ఫోటోలతో పాటు ఒక ఫోటో బూత్, సిగేచర్ బోర్డులను కూడా సందర్శనకు ఉంచారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన ప్రచురణల విభాగం స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన పుస్తక ప్రదర్శనను ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, రీజనల్ ఔట్రీచ్ బ్యూరో సౌత్‌జోన్ డైరెక్టర్ జనరల్ ఎస్.వెంకటేశ్వర్, ఆర్వోబీ డైరెక్టర్ శృతిపాటిల్, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, ప్రచురణల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ వందన, శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.