Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్లో ఉన్న ప్రభుత్వ లేధర్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌లో రూ.3 కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల బాలుర హాస్టల్‌ను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, ఎమ్మెల్సీ వాణి దేవి, టెక్నాలజీ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్, తదితరులతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హాస్టల్‌ను ప్రారంభించారు. అనంతరం కళాశాలలో వాటర్ప్లాంట్తో పాటు, పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా తయారు కావలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. వృత్తి విద్యా కోర్సులకు డిమాండ్ ఉన్నందున, విద్యార్థులు ఆసక్తి ఉన్న కోర్సుల్లో ఇష్టంగా చదివి,ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రూ.127 కోట్ల 33 లక్షలతో ,17 పాలిటెక్నిక్ కళాశాల భవనాలను నిర్మించినట్టు చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విధులను నిర్వహిస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను రూ. 40,270 నుండి రూ. 58,850 కు పెంచినట్టు వివరించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నైపుణ్యాన్ని, పరిజ్ఞానాన్ని పెంచేందుకు 1,873 ల్యాప్ టాప్, కంప్యూటర్లను అందించినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 22 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో దాదాపు 2,200 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం విద్యనభ్యసిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా 22 పాలిటెక్నిక్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం ఒక్కో హాస్టల్ నిర్మాణానికి 3 కోట్ల చొప్పున 66 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. రూ.6 లక్షలతో హాస్టల్లో ఫర్నిచర్ ఏర్పాటు చేసామని, దాతలు ముందుకు వచ్చి వాటర్ ప్లాంట్ విరాళంగా అందజేసినందుకు వారికి అభినందించారు. అసంపూర్తిగా ఉన్న స్కిల్ డెవలప్మెంట సెంటర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గాంధీ రూ.10 లక్షలు, ఎమ్మెల్సీ వాణి దేవి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్టు ప్రకటన చేశారు. అనంతరం ఇనిస్టిట్యూట్ ఆవరణలో ప్రతి శుభ సందర్భంలో మొక్కలు నాటాలని విద్యార్థులకు మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజు, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కష్ణ గౌడ్, తెరాస నాయకులు ఉట్ల కష్ణ ,శ్రీను పటేల్, చెన్నం రాజు, దారుగు పల్లి నరేష్ , రమేష్ పటేల్, భాస్కర్ రెడ్డి,వినోద్, నరేష్, జగదీష్ మల్లేష్ ,యాదగిరి, సల్లావుద్దీన్, రజినీకాంత్ ,రవి శంకర్ ,సుబ్బయ్య , వెంకటరెడ్డి రామేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.