Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి
నవతెలంగాణ-మేళ్లచెర్వు
ప్రజలకిచ్చిన హామీలీను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.శుక్రవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.గతంలో ఇచ్చిన హామీలను, పథకాలను పక్కనబెట్టి కొత్త పథకాలు, జీవోలు విడుదల చేస్తున్నారని, పాతవి అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.దళితులకు ప్రతి కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని, రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి మొత్తం 9 లక్షల దళిత కుటుంబాలున్నాయని, దానిలో ఆరు లక్షలు గ్రామీణ ప్రాంతాల వారున్నారన్నారు.అసలు గుంటభూమి లేని కుటుంబాలు మూడు లక్షలు ఉన్నాయని సర్వేలో తేలిందన్నారు.గతంలో చెప్పి ఇప్పుడేమో దళితులకు మూడడెకరాలిస్తానని ఎప్పుడూ అనలేదని కేసీఆర్ అనడం ఆయన మాటల గారడీకి నిదర్శనమన్నారు.దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా దళితబంధు పేరుతో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పే మాటలను ప్రజలు నమ్మరన్నారు.కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత హామీ హామీగానే మిగిలిపోయిందని, పైగా రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నారన్నారు.అర్హులకు డబుల్బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని కనీసం సింగిల్బెడ్రూమ్ ఇండ్లు కూడా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భతి ఇస్తానన్నహామీ హామీగానే మిగిలిందన్నారు.ఉచిత వైద్యం అందిస్తానని చెప్పి కార్పొరేట్ వైద్యశాలల కొమ్ముగాస్తున్నారన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారని, కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడి ఏండ్లవుతున్నా సొంత భవనాలు ఏర్పాటు చేయలేదన్నారు.అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యపద్ధతిలో పాలన జరగడం లేదన్నారు. కేసీఆర్ ధనబలంతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నియంతలా వ్యవహరి స్తున్నారన్నారు. ప్రజాఉద్యమాలను పోలీసులతో అణగదొక్కు తున్నారన్నారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రంలో ప్రజాకాంక్షలకనుగుణంగా పాలన సాగడం లేదన్నారు. కేసీఆర్ మాటలు నీటి మూటలుగానే మిగిలాయని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ను విశ్వసించరన్నారు.ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నాగారపు పాండు, వెంకట్రెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సైదులు పాల్గొన్నారు.