Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసుల హకులపై అలుపెరుగని పోరాటయోధుడు కొమురంభీం
- లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యనాయక్
- ఘనంగా కొమురంభీం జయంతి వేడుకలు
నవతెలంగాణ-కొడంగల్
ఆదివాసుల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మకమైనవి అని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య నాయక్, అంబేద్కర్ యువజన సంఘం తాలూకా అధ్యక్షుడు రమేష్ బాబు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య అన్నారు. కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొమురం భీం 120 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమురం భీం 15 ఏండ్ల వయసులోనే అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించడంతో కుటుంబంతో కలిసి కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్కు వలస వెళ్లారని అన్నారు. ఆ సమయంలో నిజాం పాలన సాగుతుండగా దానికి వ్యతిరేకంగా గెరిల్లా శైలిలో పోరాడిన మహావీరుడని గుర్తు చేశారు. భీమ్ జల్ జంగిల్ జమీన్ నినాదానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. కొండకోనల్లో ప్రకతితో సహజీవనం సాగించే ఆదివాసి ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదించాడని చెప్పారు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించిన మహానీయుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ తాలూకా నాయకులు భీమ్ రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ నరేందర్, రజక సంఘం మండలాధ్యక్షుడు అశోక్, ఎస్సీ,ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు దస్తప్ప, కౌన్సిలర్ శంకర్ నాయక్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.