Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు సంస్థ చేతిలోకి భోజన పథకం
- కార్మికులతో 20 ఏండ్లుగా వెట్టి చాకిరి చేయించుకున్న సర్కార్
- ఉన్నఫలంగా ప్రయివేటుకు అప్పగిచ్చేందుకు కుట్ర
- రోడ్డున పడనున్న 3500 మంది కార్మికులు
- ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో అక్షయ పాత్ర
- భోజనంలో నాణ్యత లేదంటూ గర్భిణులు, బాలింతలు ఆందోళన
- సర్కారు తమ వైఖరిని వెనక్కి తీసుకోవాలని కార్మికులు, వివిధ సంఘాల నాయకుల డిమాండ్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఎన్నో ఏండ్లుగా చాలిచాలని వేతనాలతో పని చేస్తున్న మధ్యాహ్నా భోజన తయారీ కార్మికుల పొట్ట కొట్టేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను అక్షయ పాత్రకు అప్పగించి భోజన తయారీ కార్మికులు ఉపాధి లేకుండా చేసిన పరిస్థితి. ఇదే తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నా భోజన పథకాన్ని సైతం ప్రయివేటు సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవడంతో కార్మికుల్లో అందోళన మొదలైంది. ఇన్నా ళ్లు ఇదే పనిని నమ్ముకుని భవిష్యత్‌లో పర్మినెంట్ అవుతుం దని ఆశ పడ్డ కార్మికుల ఆశలపై సర్కారు నీళ్లు చల్లుతుంది. మధ్యాహ్నా భోజన పథకాన్ని ప్రయివేటు సంస్థలకు అప్పగించి మా పొట్టకొట్టొదని కార్మికులు ప్రభుత్వానికి మెర పెట్టుకున్న ఫలితం లేక పోయిందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కాను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పోరాటకు సిద్ధమంటున్న కార్మికులు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2,267 ప్రభుత్వ పాఠ శాలలు ఉండగా ఇందుల్లో మధ్యాహ్నా భోజన పథకం కింద సుమారు 3500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పథకం ప్రారంభం 2002 నుంచి 20 ఏండ్ల కాలంగా కార్మికులు నె లకు రూ. 300 నుంచి ప్రస్తుతం రూ. 1000లకు అత్తెసరు వేతనాలతో వెట్టి చాకిరి చేస్తున్నారు. సకాలంలో ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో స్కూళ్లల్లో విద్యార్థులకు తమ సొంత డబ్బులు ఖర్చుపెట్టి భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో అప్పుల పాలైన కార్మికులు సొంత ఆస్తులు అమ్ముకున్న పరిస్థితులు ఉన్నా యి. ఇప్పటికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మధ్యాహ్నా భో జనం పెండింగ్ బిల్లు రూ. 70 లక్షల వరకు ఉంది. ఇలాం టి ఇబ్బందులన్ని తట్టుకుని విధులు నిర్వహిస్తున్న కార్మికు లను ఉన్న ఫలంగా తప్పించేందుకు ప్రభుత్వం కుట్రలు చేయడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్నా భోజన పథకాన్ని ప్రయివేటు సంస్థలకు అప్పగించి చేతులు దులుపుకునే ప్రతయ్నంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో అక్షయ పాత్ర సంస్థకు మధ్యాహ్నా భోజన పథకాన్ని అప్పగించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను అక్షయ పాత్రకు అప్పగించారు. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో భోజన తయారీ కార్మికులు ఉపాధి కోల్పోయారు.
విద్యార్థుల తల్లిదండ్రుల సంతకాల సేకరణ
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభు త్వం యూనిఫామ్ ఇస్తోంది. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రు ల నుంచి సంతకాలు తీసుకున్నారు. ఈ సంతకాలు చూపి విద్యార్థుల తల్లిదండ్రులు మధ్యాహ్నా భోజన పథకాన్ని ప్రయి వేటు సంస్థలకు అప్పగించేందుకు ఒప్పుకున్నారని ఉన్నతాధికారులు తీర్మాణాలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
ప్రస్తుతం అక్షయపాత్ర షాద్‌నగర్ ప్రాంతంలో అంగన్ వాడీ కేంద్రాలకు భోజనం సరఫరా చేస్తోంది. అక్షయపాత్ర మిషన్ల ద్వారా వండిన భోజనం పిల్లలకు అందించే మధ్యాహ్నా సమయానికి పడైపోతుందని జడ్పీ సర్వసభ్య సమావేశంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్, మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అక్షయ పాత్ర సరఫరా చేస్తున్న భోజనంపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున్న ఫిర్యా లు వచ్చాయి. ఇంత జరుగుతున్న మధ్యాహ్నా భోజన పథ కాన్ని పూర్తిగా అక్షయ పాత్రకు అప్పగించడాని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
విద్యార్థులు పౌష్టికహారానికి దూరమయ్యే ప్రమాదం
పౌష్టికహారం లోపం రేటులో దేశంలో టాప్ టెన్‌లో తెలంగాణ ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణ యంతో మరింత పెరగనుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపడక పోయిన మధ్యాహ్నా భోజన కార్మికులు వారంలో మూడు రోజులకు విద్యార్థులకు గుడ్లు పెడు తున్నారు. అక్షయపాత్ర గుడ్లు ఇచ్చే పరిస్థితి లేదు. వారిని డిమాండ్ చేసే హక్కు కూడ లేక పోవడంతో వారు పెట్టింది విద్యార్థులు తినాల్సిందే.. లేదంటే ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకునే పరిస్థితి నెలకొననుంది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
చావుకైన సిద్ధం.. ఉపాధి పోతే ఊరుకోం
20 ఏండ్లుగా కనీసం దినసరి కూలీ లేకుండ వెట్టి చేసినాం. ఇదే పనిని నమ్ముకుని ఆశతో బతుకుతు న్నాం. ఇన్నాళ్లు కడుపు మాడ్చుకుని పనిచేసింది. ఉపాధి కోల్పోడానికి కాదు. భవిష్యత్ ఉంటదన్న ధీమతో అప్పులు చేసి విద్యార్థులకు వండిపెట్టాం. ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని తప్పిస్తామంటే ఊరుకునేది లేదు. చావడానికైన సిద్దమే. మేము మాత్రం మా పనిని మాత్రం పోనివ్వం.
- స్వప్న, మధ్యాహ్నా భోజన తయారీ కార్మికురాలు
కార్మికుల ఉపాధికి గండి కొట్టొదు
మధ్యాహ్నా భోజన తయారీ కార్మికులను నెలకు రూ. 300 వేతనం నుంచి పనిచేయించి.. ఇప్పుడు ఉన్న ఫలంగా విధుల నుంచి తొలగిస్తామనడం సరికాదు. విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన భోజనం అందించేందుకు కృషి చేయాలి. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదంటే కార్మికులను ఏకం చేసి ఉద్యమాలు చేస్తాం.
- కవిత, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ రంగారెడ్డి