Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
కోవిడ్ విజృంబిస్తున్న కారణంగా పాఠశాలలకు ప్రభుత్వం ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్కూల్లో విద్యార్థులు లేకుండానే 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందుకు గాను ఓ ఉపాధ్యాయుడు అంతా తానేఅయి పాఠశాలను ముస్తాబు చేస్తూ కనిపించాడు. మంగళవారం పరిగి మున్సిపల్ పరిధిలోని సుల్తాన్ నగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న వేణు గోపాల్ అనే ఉపాధ్యాయుడు స్కావెంజర్‌గా మారి చీపురు చేత పట్టుకుని పాఠశాలను శుభ్రం చేశాడు. ఒక్కడే నీళ్లు తెచ్చుకుని పాఠశాలను కడిగి, జెండా కట్టకు సున్నం వేశాడు. పాఠశాల పరిసర ప్రాంతంలోని పిచ్చి మొక్కలను తీసి వేశాడు. ప్రభుత్వం పాఠశాలలో స్కావెంజర్లను తీసి వేయడంతో ఆ పనిని మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీలో గ్రామపంచాయతీ కార్మికులు వచ్చి పాఠశాలను శుభ్రం చేయవలసి ఉంటుంది. కానీ కార్మికులు రాక పోవడంతో పాఠశాల ఉపాధ్యాయులే పాఠశాలలను శుభ్రం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు బోధించే చేతులతోనే చీపురు పట్టి పాఠశాలను శుభ్రం చేస్తున్నారు. ఉపాధ్యాయుడు వేణుగోపాలరావు పని చేస్తుంటే పలువురు కాలనీవాసులు వాపోయారు. మరికొందరు అభినందించారు.