Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూముల ధరలకు మార్కెట్ విలువ.. రిజిస్ట్రేషన్ల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల.. కలగానే మిగిలేలా ఉంది. జిల్లాలో ప్రస్తుతం భూముల ధర సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్నాయి. దానికి తోడు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల పెంపు నిర్ణయం 'మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డ' చందంగా మారింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు, వాణిజ్య భవనాలు, అపార్టుమెంట్ల మార్కెట్ విలువల పెంపు ఫిబ్రవరి నుంచి అమలు కాబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ భూములపై 25 శాతం, అపార్ట్మెంట్లపై 50 శాతం పెంపు ఉండొచ్చు అనేది సమాచారం.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే సామాన్యుడు భూ ములు కొనే పరిస్థితి లేదు. మళ్లీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు నిర్ణయం తీసుకోవడంతో సామాన్యు లు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం తమ ఖజానాను నింపుకునేందుకు బహిరంగ మార్కెట్కు అనుగుణంగా భూముల విలువలు పెంపు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై తీసుకుంటున్న నిర్ణయాలు మధ్య తరగతి కుటుంబాలపై మరింత భారం పెంచనుందని నిపుణులు వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్ల ఫీజులు డిసెంబర్లో అత్యధికంగా రూ.330 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి భూ రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్పై వేసిన ఆదాయ అంచనా రూ.12,500 కోట్లలో ఎక్కువగా ఆదాయం సమకూర్చే జిల్లాలో మొదటి స్థానంలో హైదరాబాద్, తరువాత రంగారెడ్డి జిల్లా రెండోవ స్థానంలో ఉంది. ప్రస్తుతం పెరగనున్న రిజిస్ట్రేషన్ల చార్జీలతో మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. కోవిడ్-19 నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం కొంత ఆదాయం తగ్గినట్టు చెబుతున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.158 కోట్ల ఆదాయం వచ్చింది. నెలాఖరుకు రూ.200 కోట్లు దాటే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
పేదోడీపై భారం
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పేదోడీ జీవిత కాలం కష్టం చేసి సంపాధించిన డబ్బులతో హైదరాబాద్ శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లాలో సొంత ఇంటిని నిర్మించుకోవడం అనేది కలగానే మిగులనుంది. రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపు వచ్చే నెల మొదటి వారం నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇటు వ్యాపారులు, విక్రయదారులు, వియోగదారుల గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి. స్థిరాస్తుల మార్కెట్ విలువ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ఏ మేరకు ఉంటుందోనన్న విషయంపై సతమతమవుతున్నారు. దీంతో ఇటీవల వ్యవసాయ, వ్యవసాయేతర భూములు కొనుగోలు చేసిన వారి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గడువు ఉన్నప్పటికీ వచ్చే నెల నుంచి భూముల విలువలు పెరగనున్నాయన్న విషయం తెలుసుకుని.. అదనపు భారం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకోవడం, తేదీలు ఖరారు కావడంతో సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు.
ప్రభుత్వం ప్రజా సౌకర్యాలను గాలి వదిలింది
రాష్ట్ర ప్రభుత్వం తమ ఖజానాను నింపుకోడానికి.. ప్రజా సౌకర్యాలను గాలికి వదిలేస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో భూముల ధరలపై నియంత్రణ లేకుండా పోయింది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా అవి ఏమీ పనిచేయడం లేవు. మరో పక్కన ప్రభుత్వం భూ రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపుపై తీసుకుంటున్న నిర్ణయం మధ్య తరగతి కుటుంబాలపై తీవ్రమైన భారం పడనుంది. కనీసం సొంత ఇల్లు నిర్మించుకునే ఆవకాశం లేని పరిస్థితి ఏర్పడనుంది. ప్రభుత్వం ప్రజా సౌకర్యాల దృష్ట్యా తన నిర్ణయాన్ని పునరాలోచించాలి.
- కె. భాస్కర్, సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి