Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గజ్జల యోగానంద్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ఎన్నికల సమయంలో ప్రజలకు హామీల వర్షం కురిపించి గద్దెనెక్కిన అధికార పార్టీ నేతలు నేడు వారి సమస్యలను పట్టించుకోవడం లేదని శేరిలింగంపల్లి బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, అసెంబ్లీ ఇన్చార్జి గజ్జల యోగానంద్ అన్నారు. ఆదివారం బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు ఆంజనేయులు ఆధ్వర్యంలో పర్యటించారు. మార్తాండ్ నగర్లోని స్ట్రీట్ నెంబర్ 1లో పర్యటించగా స్థానికంగా రోడ్లు సరిగా లేవని ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. అలాగే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టిన పనుల్లో నాణ్యత పట్టించలేదని వాపోయారు. స్ట్రీట్ నెంబర్-9 లో మురుగు కాలువ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వల్ల ప్రమాదం పొంచి ఉందని స్థానిక ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. మార్తాండ్ నగర్ వివిధ వీధులలో పర్యటించిన బీజేపీ నేతలకు స్థానిక సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ ఎన్నికలప్పుడు హామీల వర్షం కురిపించి ఎన్నికలలో గెలిచిన అధికార పార్టీ నేతలు స్థానిక సమస్యలను పట్టించుకోకపోవగా, కమిషన్ల కోసం కాంట్రాక్టర్లతో కలిసి అరకొర పనులు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా పనుల్లో నాణ్యత పాటించాలని తెలిపారు. తాగునీటిలో మురుగు నీరు కలవకుండా స్వచ్ఛమైన నీటిని అందించాలని డిమాండ్ చేశారు.
అనంతరం జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులతో మాట్లాడిన యోగానంద్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులకు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని, ఇచ్చే దానిలో కూడా రూ. 3 వేలు తక్కువగా ఇస్తున్నారని, దీంతో తమ కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను కొత్తగా నియమించకుండా ఉన్నవారిపై పనిభారం మోపుతున్నారని వాపోయారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కొండాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రఘునాథ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కోశాధికారి రమేష్ సోమిశెట్టి, రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మేరి సాల్మన్, 106 డివిజన్ జనరల్ సెక్రటరీ గాయత్రి, కొండాపూర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ గౌడ్, డివిజన్ జనరల్ సెక్రటరీ వెంకటేష్, బీజేపీ నాయకులు రమేష్ రెడ్డి, కష్ణగౌడ్, రంజిత్, కిట్టు, సందీప్, అరవింద్, శివ, సాయి పటేల్, శ్రీకాంత్ పాండే, కిషన్జి, అజ్జు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.