Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పాలనలోనే అధిక నోటిఫికేషన్లు
- కాంగ్రెస్ జిల్లా నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగా మిగిలిన కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగుల గర్జనకు గురికాక తప్పదని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గాంధీభవన్‌లో చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్షకు సంఘీభావంగా మంచాల మండలం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధిక నోటిఫికేషన్లు జారీ చేసిందన్నారు. డీఎస్సీతో పాటు అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు వేశారని గుర్తు చేశారు. నిరుద్యోగులు ఏకమై ఉక్కు సంకల్పంతో నిర్వహించిన ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులు అంతకంతకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ మాటనే కేసీఆర్ మరిచిపోయారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇస్తామన్న నిరుద్యోగ భృతి కూడా నేటికీ ఇవ్వడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ, పీజీలు పూర్తిచేసిన నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి వచ్చే ఎన్నికల వరకు గుర్తుకు వచ్చే పరిస్థితి కేసీఆర్‌కు కనిపించడం లేదన్నారు. మరోసారి ఎన్నికల హామీగానే నిరుద్యోగ భృతి, నోటిఫికేషన్ల హామీలు మిగిలిపోనున్నాయని చెప్పారు. ప్రతి ఎన్నికల్లో నిరుద్యోగ యువతను మోసం చేసే విధానాలతో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికైనా నిరుద్యోగులు ఆదుకునేందుకు ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలను నిర్వహిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరుద్యోగ గర్జనకు గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో జంగారెడ్డి, వెంకట్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, రవికుమార్, ధన్‌రాజ్, చరణ్, గోవర్థన్‌రెడ్డి, సందీప్, లచ్చిరాంనాయక్ తదితరులున్నారు.