Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపటి నుంచి 3వ తేదీ
వరకు జాతర ఉత్సవాలు
- ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వహకులు
- ధర్మకర్త పల్లా సావిత్రి ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణ
నవతెలంగాణ-యాచారం
శివరాత్రి ఉత్సవాలకు యాచారం మండల పరిధిలోని నంది వనపర్తిలో వెలసిన శైవ క్షేత్రం శ్రీ నందీశ్వర ఆలయం ముస్తాబైంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త పల్లా సావిత్రి ఆధ్వర్యంలో శివరాత్రి జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ జాతర ఉత్సవాలు మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ పూజారి తెలిపారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా నందీశ్వర ఆలయంలో వారం రోజుల ముందే పండుగ వాతావరణం నెలకొంది. ఈ జాతర ఉత్సవాలు పురస్కరించుకొని నందీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అఖండ దీపారాధన, గణపతి పూజ, కలశ స్థాపన వంటి ప్రధాన పూజ కార్యక్రమాలు నిర్వహించేం దుకు నిర్వాహకులు ఆలయాన్ని సిద్ధం చేశారు. మహాశివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా మార్చి ఒకటి మంగళవారం రోజున సాయంత్రం 6 గంటలకు శివునికి అఖండ దీపారాధన, గణపతి పూజ, ధ్వజారో హణం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు, జాగారం, లింగోద్భవం, రుద్రాభిషేకం, 2వ తేదీ బుధవారం రోజున స్వామివారికి, పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహౌత్స వం, మూడవ తేదీ గురువారం రథోత్సవం, పార్వతి దేవికి ప్రత్యేక కుంకుమార్చనలు వంటి కార్యక్రమాలు జరుగు తాయని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. శివరాత్రి జాతర ఉత్సవాలకు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పూజారి వెల్లడించారు.
గ్రామ పంచాయతీ తరపున అన్ని ఏర్పాట్లు
శ్రీ నందీశ్వర ఆలయం జాతర మహౌత్సవాలు మా గ్రామంలో పండుగ వాతావరణంలో ప్రతి సంవత్సరం జరుగుతాయి. గ్రామ పంచాయతీ తరుపున జాతర ఉత్సవాలకు సహకారం అందిస్తు న్నాం. జాతర ఉత్సవాల కు వచ్చే మారుమూల ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నాం. మండలంలోనే నంది వనపర్తిలో ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మూడు రోజుల పాటు మా గ్రామంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
- కంబాల పెళ్లి ఉదయశ్రీ, సర్పంచ్
ప్రతీ సంవత్సరం అన్నదానం నిర్వహిస్తాం
శివరాత్రి జాతర ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రతీ సంవత్సరం అన్నదానం నిర్వహి స్తాం. జాతర ఉత్సవాల సందర్భం గా ఆలయంలో కరెంట్ సౌకర్యం, స్వామి శ్లోకాలను భక్తులకు వినిపిం చేందుకు సౌండ్ సిస్టం, ఆలయాన్ని మొత్తం విద్యుత్ కాంతులతో నింపేస్తాం. ఈ జాతరకు వచ్చే భక్తులకు ఆసౌకర్యం కలవకుండా తన సొంత ఖర్చులతో ఏర్పాట్లను చేస్తాం. మా గ్రామంలో నందీశ్వర ఆలయం జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆలయానికి మండలంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతీ సంవత్సరం శివపార్వతీల కల్యాణోత్సవం నిర్వహిస్తాం.
- రాచర్ల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ యాచారం