Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న డీఎస్పీ శ్రీనివాస్
నవతెలంగాణ-కోడంగల్
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వీటితో నేరాలను కట్టడి చేయవచ్చని డిఎస్పీ శ్రీనివాస్ అన్నారు. సోమవారం కోడంగల్ మండలం అంగడి రైచూరు గ్రామంలో సీసీ కెమెరాలను ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయవచ్చని, నేరస్తులు సీసీ కెమెరాలు ఉన్న ప్రదేశాలలో నేరం చేసేందుకు వెనుకడుగు వేస్తారని తెలిపారు. వార్డు సభ్యులు తమ కాలనీలో జరిగే అసాంఘీక కార్యకలాపాల గురించి పోలీసులకు తెలియజేసి సహకరించాలని సూచించారు. వార్డులో పటిష్టమైన సీసీ కెమెరాల రక్షణ వ్యవస్థ ఉండటంతో ప్రజల్లో భద్రతమైన భరోసా ఉంటుందన్నారు. ముఖ్యంగా గంజాయి, మట్కా, గుట్కలాంటివి తమ గ్రామాలలో ఉంటే పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ మాట్లాడుతూ సీసీ కెమెరాలను గ్రామ భద్రత కోసం ఏర్పాటు చేయడం అందరికి ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ సామ్య నాయక్, సర్పంచ్ గోవిందు తదితరులు పాల్గొన్నారు.