Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి డిమాండ్
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోరుకుమార్కు వినతి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ భూముల కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు భూకబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ భూకబ్జాదారులకు ప్రోత్సహిస్తున్న హయత్‌నగర్ మండల తహసీల్దార్‌ను వెంటనే తప్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రవీంద్ర చారి మాట్లాడుతూ హయత్ నగర్ మండల పరిధిలోని బాగ్ హయత్ నగర్ సర్వే నెంబర్ 308లో సుమారు ఏడు ఎకరాలు, సర్వే నెంబర్ 207లో సుమారు పది ఎకరాలు, హన్మగల్ హయత్ నగర్ సర్వే నెంబర్ 60 లోని భూములలో స్థానిక తహసీల్దార్ అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ బకాసురులు యద్దేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆస్తులు కనుమరుగు చేస్తూ, ప్రభుత్వ ఆదాయానికి కూడా నష్టం కలిగిస్తున్నారని తెలిపారు. హయత్‌నగర్ మండలంలో రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడానికి తహసీల్దార్ కారణమని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు కాపాడాలని ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తహసిల్దార్ వ్యవహరిస్తున్నారని వెంటనే విధుల్లో నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఐ బృందం జిల్లా కలెక్టర్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు ముత్యాల యాదిరెడ్డి, ఎస్. శేఖర్‌రెడ్డి, రామావత్ శక్రి, టి. నరసింహ, కె. కళ్యాణి పాల్గొన్నారు.