Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు పత్య నాయక్
నవతెలంగాణ-ఆమనగల్
రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రావలసిన రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు నేనావత్ పత్య నాయక్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం ఆమనగల్ పట్టణంలో గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు పత్య నాయక్ హాజరై మాట్లాడారు. గిరిజనుల రిజ్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు రిజ్వేషన్ల బిల్లు పంపలేదని అబద్దాలు ఆడడంతోనే బీజేపీ పార్టీకి గిరిజనుల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇలాంటి అబద్దాలు చేప్పడం గిరిజనులకు ద్రోహం చేయడమేనని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 90వేల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంలో రిజర్వేషన్లు పెంచకపోతే గిరిజన యువతకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన 2017లో గిరిజనులకు రిజర్వేషన్లు పేంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గిరిజన జాతి కలలను సాకారం చేసేవిధంగా మాతాండాలో మారాజ్యం నినాదానికి కట్టుబడి ముఖ్యమంత్రి కేసీఆర్ 500 జనాభా కల్గిన తాండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో బాగంగా జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రావలసిన 10 శాతం రిజర్వేషన్లను వెంటనే కేంద్ర ప్రభుత్వం పేంచకపోతే గిరిజనుల ఆగ్రహానికి గురి కాక తప్పదని పత్య నాయక్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు సరిత పంతు నాయక్, సర్పంచ్లు వడ్త్యావత్ సోనా శ్రీను నాయక్, కడారి మలమ్మ యాదయ్య, ఉపసర్పంచులు మల్లేష్ నాయక్, ప్రశాంత్ నాయక్, ఏఎంసీ డైరెక్టర్ రమేష్ నాయక్, నాయకులు సంజీవ్, మల్లేష్, రమేష్ నాయక్, హేమ్లా నాయక్, విజరు రాథోడ్, సురేష్, చంద్రు నాయక్, జక్రం నాయక్, హుంలా నాయక్, పూసల భాస్కర్, రమేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.