Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్ పిలుపునిచ్చారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జీపుజాత ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల పరిరక్షణకు, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అనేక కార్మిక సంఘాలు సంయుక్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నాయన్నారు. ఈ నెల 28, 29వ తేదీల్లో నిర్వహించే ఈ సమ్మెలో కార్మికులు, కర్షకులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగవైకల్యం అయిన వారికి రూ.5లక్షల ఇవ్వాలని అన్నారు. కార్మికులు సొంత ఇల్లు నిర్మాణానికి ఇసుక రాయితీ ఇవ్వాలని, హెల్పర్ బోర్డు ఉన్నటువంటి డబ్బులు వేరే సంస్థలకు మళ్ళించ వద్దని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అనేక పరిశ్రమల్లో కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయడం లేదన్నారు. 12 గంటలు పని చేయించుకుంటూ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను రద్దు చేస్తూ తీసుకువచ్చిన నాలుగు లేబరు కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచిందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే లేబర్ కోడ్లను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు చింతపట్ల ఎల్లేశ, సీహెచ్ బుగ్గరాములు, యాదగిరి, లింగం, జగన్ తదితరులు పాల్గొన్నారు.
స్లగ్ : సీఐటీయూ