Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ కరణం అరవిందరావు
నవతెలంగాణ-పరిగి
వరి ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని ఎంపీపీ కరణం అరవిందరావు అన్నారు. మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన పరిగి మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. యాసంగి వరి ధాన్యం మొత్తం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని ఎంపీడీవో శేషగిరిశర్మకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో సాగు పెరిగిందని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటు వంటి పథకాలు ప్రజాదరణ పొందాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలని రాష్ట్రంపై కక్ష సాధింపులు చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి పండించిన వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కావలి సత్యనారాయణ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వెంకట్ రామ్ రెడ్డి, ఎంపీటీసీలు రవి, కో-ఆప్షన్ సభ్యులు మహమ్మద్ తాజుద్దీన్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు రాజేందర్ పీఏసీఎస్ డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు.