Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గీతన్న బంధును వెంటనే ప్రకటించాలి
- కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన
- కార్యదర్శి యంవి రమణ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రాష్ట్రంలో కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 5లక్షల కుటుంబాల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.5వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.వి. రమణ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని వైష్ణవి గార్డెన్లో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సమావేశం బోయపల్లి సుధాకర్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. తరతరాల నుండి వత్తి చేస్తూ ప్రభుత్వానికి పన్నులు కడుతూ స్వయం ఉపాధి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. ప్రభుత్వ లిక్కర్ పాలసీ వలన రోజు రోజుకి వృత్తి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం లిక్కర్, బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారిస్తూ గీత కార్మికులకు పూర్వవైభవం తెస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యనిషేధం అమలు చేయాలన్నారు. ప్రతీ సొసైటీకి 5ఎకరాల భూమి, కల్లుకు మార్కెట్, నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు. సభ్యులైన ప్రతి ఒక్కరికి బైక్‌లు ఇవ్వాలని కోరారు. కల్లుగీత వృత్తిదారులకు గీతన్న బంధు పేరుతో రూ.10లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షన్ రూ.5వేలకు, ఎక్స్‌గ్రేషియా రూ.10లక్షలకు పెంచాలన్నారు. మెడికల్ బోర్డు నిబంధన తొలగించాలని కోరారు. అర్హులైన వారందరికీ సభ్యత్వం, గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. కొత్త జిల్లాల పేరుతో ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో చేతి వృత్తి దారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ గోరెంకల నర్సింహా, కల్లుగీత కర్మీక సంఘం సీనియర్ నాయకులు యాదయ్య, బాల్‌రాజు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.