Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంటా-వార్పు కార్యక్రమం అడ్డుకున్న పోలీసులు
- మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్
- బడాబాబుల కోసమే అధికారులు పనిచేస్తున్నారు: డాక్టర్ ప్రేమ్ రాజ్
నవతెలంగాణ-శంషాబాద్
స్థానిక సమస్యలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కయ్యారని బీజేపీ నాయకులు నాయకులు ఆరోపించారు. గత నాలుగు నెలలుగా శంషాబాద్‌లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినా మున్సిపల్ కమిషనర్ పెడచెవిన పెడుతున్న నేపథ్యంలో శంషాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో గురువారం బీజేపీ మున్సిపల్ శాఖ అధ్యక్షులు దేవేందర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు మాదిరెడ్డి మహిపాల్ రెడ్డి, బీజేవైఎం మున్సిపల్ అధ్యక్షులు వంశీ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన వంట-వార్పు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సమస్యలపై ఏమాత్రం స్పందించని మున్సిపల్ కమిషనర్ అవినీతిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ కమిషనర్ చాంబర్ వద్దకు దూసుకెళ్లి నిరసన చేపట్టారు. ఈ పరిస్థితుల్లో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని నాయకులను అరెస్టు చేసి పోలీసు వాహనంలో ఆర్జీఐఎ పోలీస్ స్టేషన్‌కు తరలించి అనంతరం విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ శంషాబాద్‌లో దేవాలయ భూములు కాపాడటంలో మున్సిపల్ రెవెన్యూ ఎండోమెంట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ జాతీయ రహదారి కాముని చెరువు సమీపంలో చారిత్రాత్మక ఫిరంగి నాలా రాతి కట్టడాన్ని అధికార పార్టీకి చెందిన బడా నేతలు ధ్వంసం చేశారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సాతం రాయి శ్రీ కోదండరామ స్వామి ఆలయం భూములు లీజుకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.హిమాయత్ నగర్ వద్ద ప్రభుత్వ భూమిలో భారీ నిర్మాణం జరుగుతుందన్నారు. కొత్వాల్ గూడ సమీపంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ భారీ అక్రమ నిర్మాణం చేపట్టితే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాల్లగూడ జోష్ కుంట కబ్జాకు గురైనట్లు అధికారులు రిపోర్టు ఇచ్చారనీ, అయినా అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారని అన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, ఎండోమెంట్ మున్సిపల్ అధికారులు బడాబాబుల కోసం పని చేస్తున్నారా అని ప్రశ్నించారు. శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ అవినీతిపై ఉన్నత స్థాయి కమిటీ వేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోని కమిషనర్‌ను సస్పెండ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ చింతల నందకిషోర్ గుప్త, ఎన్ కుమార్ యాదవ్, ఎం. భాస్కర్ రెడ్డి, బుక్క ప్రవీణ్ కుమార్ , వేమారెడ్డి జితేందర్ , కరుణాకర్ రెడ్డి , తిరుపతి రెడ్డి, వెంకటేష్ రాజిరెడ్డి, అశోక్, వీరేష్ , మెండే కుమార్ తదితరులు పాల్గొన్నారు.