Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిత్యం సగటు జీవిపై ధరల మంట మండుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు సెన్సెక్స్‌ను మరిపిస్తున్నాయి. పేదలపై పెనుభారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోటీ పడుతున్నాయి. నిత్యం పెరుగుతున్న ధరలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఇక లీటరు పెట్రోల్ ధర రూ.115కు చేరింది. ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీల మోతమోగనుంది. ధరల పెరుగుదలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఎత్తుడగలు తెరమీదకు తెచ్చేందుకు పోటీ పడుతున్నాయి.
- సెన్సెక్స్‌ను మరిపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- పేదలపై పెనుభారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోటీ
- నిత్యం పెరుగుతున్న ధరలతో జనం బెంబేలు
- రూ.115కు చేరిన లీటరు పెట్రోల్
- ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీల మోత
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
నిత్యం పెరుగుతున్న ధరలతో పేద ప్రజలపై పెనుభారం పడుతోంది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతుంటే..రాష్ట్ర ప్రభుత్వం సైతం తామేమీ తక్కువేమీ కాదన్నట్లుగా ధరలను మోపుతోంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పోతే.. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్తు చార్జీలు మోపుతుంది. మొన్న ఆర్టీసీలో చార్జీలు పెంచి ప్రయాణికులపై తెలియకుండా భారం మోపింది. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచి విద్యుత్ చార్జీలు వడ్డించేందుకు రంగం సిద్ధం చేసింది. మరో వైపు కేంద్రం వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.50కి పెంచింది. సిలిండర్‌పై గతంలో ఉన్న సబ్సిడీని తగ్గించి పేద, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం మోపుతోంది. వంట నూనె ధర లీటరు రూ. 200 పైచిలుకు ఉంది. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను ఎడాపెడా పెంచుతూ సామాన్యుల నడ్డివిరుస్తున్నాయి.
పెట్రోలుపై 10రోజుల్లో రూ.6 పైన వడ్డన...
పెట్రోలు, డీజిలు ధరలు నిత్యం పెరుగుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యతరగతి ప్రజలు వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి నేటి వరకు లీటరు పెట్రోలు, డీజిలుపై రూ.6 పైన పెరగడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. పది రోజుల్లో ధరల్లో వ్యత్యాసం ఇలా ఉంది.. తేదీ పెట్రోలు, డీజిలు 21న పెట్రోల్‌పై రూ110, 22న రూ.110.8, 23న రూ.111.7, 24న రూ.111.7, 25న రూ.112.5, 26న రూ.113.4, 27న రూ.113.9, 28న రూ.114.2, 29న 115.0, 30న115.9 చొప్పున పెరిగాయి.
గుదిబండలా సిలిండర్
వంట గ్యాస్ సిలిండర్ ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలు ఇలాగే పెరుగుతూ పోతే భవిష్యత్‌లో సిలిండర్‌ను ఉపయోగించే పరిస్థితి ఉండదని వాపోతున్నారు. వంట గ్యాస్‌పై క్రమంగా సబ్సిడీ ఎత్తివేస్తున్న కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం మోపుతోంది. ప్రస్తుతం 14 కేజీల ఇండేన్ డొమెస్టిక్ సిలిండర్ గ్యాస్ ధర రూ.1000 దాటింది. గడిచిన ఐదు నెలల కాలంలో వంట గ్యాస్ సిలిండర్‌పై పెరిగిన ధరల్లో వ్యత్యాసాలు ఆందోళన కలిగిస్తోంది.
నెల డొమెస్టిక్ (14 కేజీలు)- కమర్షియల్(19 కేజీలు)
నవంబరు 973.50 - 2213.50
డిసెంబరు 973.50 - 2316.50
జనవరి 973.50 - 2216.50
ఫిబ్రవరి 973.50 - 2127.00
మార్చి 1023.50 - 2227.00
విద్యుతు మోత
ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీల మోత మోగనుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గహావసరాలపై యూనిట్‌కు 50 పైసలు పెరుగనుండగా, వాణిజ్య, వ్యాపార, పరిశ్రమలకు యూనిట్‌కు రూ.1 చొప్పున భారం పడనుంది. ఇండ్ల కనెక్షన్లకు ఇప్పటి వరకు స్లాబ్ 50 నుంచి 100 యూనిట్లలోపు వినియోగిస్తున్న విద్యుత్‌కు యూనిట్‌కు రూ.1.45 చెల్లిస్తుండగా ప్రస్తుతం పెరిగిన 50 పైసల వంతున రూ.1.95 చెల్లించాల్సి ఉంది. 100 యూనిట్ల వినియోగం దాటిన వారికి బిల్లుల మోత మోగనుంది. తాజాగా ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేందుకు నిర్ణయం తీసుకోగా ప్రజలపై అదనపు భారం పడనుంది.