Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ ఇప్తేకర్ అహ్మద్
- పెరిగిపోతున్న ఆన్లైన్ మోసాల పట్ల అవగాహన
నవతెలంగాణ-కొడంగల్
ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ ఇప్తేకర్ అహ్మద్ సూచించారు. శుక్రవారం కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అన్ని రకాల లావాదేవీలు, ఆన్లైన్లలో జరుగుతున్నాయన్నారు. ఇందులో ఎన్నో రకాల మోసాలు జరుగుతున్నాయని చెప్పారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రతి నిత్యం ఎన్నో రకాల ఫోన్లు, మెసేజ్ల రూపంలో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఓటీపీ నెంబర్లు, ఏటీఎం, డెబిట్ కార్డుల పిన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఎట్టి పరిస్థితులలో ఎవరికి ఇవ్వవద్దని సూచించారు. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్స్ అప్ లాంటి వాటిలో అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాజారామ్, అధ్యాపకులు రెడ్డి శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.