Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణరంగ నైపుణ్య శిక్షణా సంస్థ ఏర్పాటు కావాలి
- స్థానికులకు బ్లూకాలర్ ఉద్యోగాలు ఇక్కడే ఇవ్వాలి
- క్రెడారు ప్రాపర్టీషో ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భవన నిర్మాణరంగానికి సంబంధించి రాష్ట్రంలో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, ప్రాంతాలకు చెందిన నిర్మాణరంగ కార్మికులు విదేశాలకు వెళ్లి నానా అవస్థలు పడుతూ పని చేస్తున్నారనీ, వారికి ఇక్కడే అలాంటి అవకాశాలు ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిర్మితమవుతున్న అనేక నిర్మాణ ప్రాజెక్టుల్లో బీహార్, ఒరిస్సా, జార్ఖండ్ నుంచి లేబర్ వస్తున్నారనీ, ఇక్కడి కార్మికులకు విదేశాలకు వెళ్లి అదే పనిచేస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించి నిర్మాణరంగం, కార్మికులు, ప్రభుత్వం మధ్య ఎక్కడో అంతరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. దాన్ని తొలగించే పని ప్రారంభించాలని ఆయన నిర్మాణరంగ సంస్థల్ని కోరారు. మూడు రోజుల పాటు మాదాపూర్ హైటెక్స్‌లో జరగనున్న క్రెడారు హైదరాబాద్ ప్రోపర్టీ షో-2022ను శుక్రవారంనాడాయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. దేశ ప్రజలు సింహభాగం గ్రామాల్లోనే ఆవాసం ఉంటున్నా, సంపద సృష్టి పట్టణాల నుంచే జరుగుతున్నదనీ, అదే దేశాన్ని నడిపిస్తున్నదని చెప్పారు. హెల్త్, ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్ విస్త్రుతమవుతున్నదని అన్నారు. 2014-15లోనే ప్రధాని నరేంద్రమోడీకి సీఎం కేసీఆర్ పట్టణాల పరిరక్షణకోసం పలు సూచనలు చేశారనీ, వాటిని ఆయన వినలేదనీ, స్మార్ట్‌సిటీ, అమృత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నదని అన్నారు. వాటిపై తాను రాజకీయ విమర్శలు చేయబోనన్నారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చూసి వస్తేనే తెలంగాణ రాష్ట్రం విలువ తెలిసి వస్తుందని అన్నారు. ఇక్కడ శాంతి భద్రతలు, తాగు, సాగు నీరు, కరెంటు సహా అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఉన్నాయని విశ్లేషించారు. రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధి జరుగుతున్నదనీ, భూముల విలువ పెరిగి, రియల్ ఎస్టేట్ డిమాండ్ బాగుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎకరా రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు తక్కువ లేదని చెప్పారు. సంపద సమంగా పంచగలిగితేనే అభివృద్ధి సాధ్యమనీ, సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్నది అదేనని విశ్లేషించారు. 2014లో తలసరి ఆదాయం 1.24 లక్షలు కాగా, ఏడేండ్లలో అది 2.78 లక్షలకు పెరిగిందనీ, అప్పటి జీఎస్డీపీ రూ. 5 లక్షల కోట్లు కాగా, ఇప్పుడది రూ. 11.55 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులను సంపద సృష్టికే ఖర్చు చేస్తున్నదనీ, అందువల్ల సంపద పునరుత్పత్తి అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, క్రెడారు అధ్యక్షుడు పీ రామకష్ణారావు, జనరల్ సెక్రటరీ వి రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జి ఆనంద్ రెడ్డి, కె రాజేశ్వర్, ఎన్ జైదీప్ రెడ్డి, బి జగన్నాధ్ రావు ట్రెజరర్ ఆదిత్య గౌర, జాయింట్ సెక్రటరీలు శివరాజ్ ఠాకూర్, కె రాంబాబుతో పాటు నిర్మాణరంగ సరఫరాదారులు, ఆర్ధిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రెడారు ప్రతినిధులు పలు సమస్యల్ని సభలో ప్రస్తావించారు. ఈ ఎగ్జిబిషన్ మే 1వ తేదీ వరకు హైటెక్స్‌లో జరుగుతుంది.