Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లానింగ్ కమిషన్‌ను నిర్వీర్యం చేసిన మోడీ సర్కార్
- ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.321కోట్లు కేటాయింపు
- పేదలు, సామాన్యులపై ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ప్రభావం : నిపుణులు
- నిధుల విడుదల అంతా ప్రధాని వద్ద కేంద్రీకృతం
న్యూఢిల్లీ : దేశం ఆర్థికంగా, సామాజికంగా ముందడుగు వేయాలంటే ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి వ్యవహారం ఉండాలని రష్యాలో కమ్యూనిస్టులు తీసుకొచ్చిన నమూనా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. రష్యాను చూసే నెహ్రూ హయాంలో మనదేశంలో పంచవర్ష ప్రణాళికలను తీసుకొచ్చారు. మొదట వ్యవసాయం, అటు తర్వాత పారిశ్రామిక రంగం..ఇలా ఒక రంగాన్ని లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి ప్రణాళికలను అమలుజేశారు. గొప్ప ఫలితాల్ని సాధించారు. ఇదంతా చెత్త..పనికిరాదు..అంటూ 2014లో ప్రధాని మోడీ 'ప్రణాళికా సంఘా'న్నే రద్దుచేశారు. దాంతో 12వ ప్రణాళికా సంఘం కాలపరిమితి 2017తో అంతా నిలిచిపోయింది. నేడు మనదేశానికి ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ఒక దిశానిర్దేశం లేదు. దీనివల్ల పేదలు, సామాన్యులు, ఆర్థికంగా వెనుకబడినవారు తీవ్రంగా నష్టపోతున్నారని నిపుణులు భావిస్తున్నారు. పేదరికం, అసమానతలు తీవ్రరూపం దాల్చుతున్నాయని ఇకనైనా మేల్కోవాలని వారు హెచ్చరిస్తున్నారు.
2014లో అధికారంలోకి రాగానే ఎవర్నీ సంప్రదించకుండా మోడీ సర్కార్ ప్లానింగ్ కమిషన్‌ను ఏకపక్షంగా రద్దుచేసింది. దాంతో ఐదేండ్ల ప్రణాళికలు గత చరిత్రగా మిగిలిపోయాయి. ప్రస్తుతం మనదేశానికి ఒక ప్రణాళిక అంటూ లేదు. ప్రణాళికా సంఘం కింద ఉన్న వాటికి గత 8ఏండ్లుగా బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తూ వస్తోంది. గత ఏడాది బడ్జెట్లో మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్‌కు రూ.1062 కేటాయించగా, ఈ ఏడాది (2022-23) బడ్జెట్లో దానిని మరింత తగ్గిస్తూ కేవలం రూ.321కి పరిమితం చేసింది.
అంతా ప్రధాని చేతిలో..
ప్రస్తుతం మన దేశం ప్రణాళికబద్ధమైన ఆర్థిక అభివృద్ధికి దూరమైందని నిపుణులు విమర్శిస్తున్నారు. మొత్తం నిధుల కేటాయింపు అంతా ప్రధాని కార్యాలయం వద్ద కేంద్రీకృతం చేయటమే ప్రణాళికా సంఘం రద్దు వెనుకున్న వ్యూహమని తెలుస్తోంది. రాజకీయంగా తమకు అనుకూలంగా లేని రాష్ట్రాల పట్ల కక్షపూరిత వైఖరి చూపటం, నిధుల విడుదల ఆపేయటమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోంది. అభివృద్ధి నిధుల విడుదలలో కేంద్రం తమ పట్ల వివక్ష చూపుతోందని అనేక రాష్ట్రాలు ఫిర్యాదు చేస్తున్నాయి.
ఎందుకు..అన్నది కూడా చెప్పట్లే..
గ్రామీణాభివృద్ధికి సంబంధించి కేంద్ర-రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. ఇందులో 'గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలకు నిర్వహణ మద్దతు, జిల్లా ప్రణాళికా కార్యక్రమాన్ని బలోపేతం చేయటం' అనేదానికి 2020-21లో రూ.364కోట్లు, 2021-22లో బడ్జెట్లో రూ.212కోట్లు కేటాయించారు. కేటాయిచిన నిధుల్ని సైతం పూర్తిగా కేంద్రం విడుదల చేయలేదు. సవరించిన బడ్జెట్ లెక్క ప్రకారం నిధుల విడుదల రూ.176మాత్రమే ఉంది. ఇలా ఎందుకు చేశారన్నది? పథకాల ఫలితాలు? విజయాలు, వైఫల్యాలు...ఈ సమాచారమేదీ కేంద్రం విడుదల చేయటం లేదు. దీనివల్ల దేశ ఆర్థిక ప్రణాళికా అభివృద్ధిని సరిగా ట్రాక్ చేయలేమని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం దేశంలో ఆర్థిక మార్పు శరవేగంగా జరుగుతోంది. అయితే దీని ప్రభావం పేదలు, మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన వారిపై ఎలాంటి మార్పు ఉందన్నది గుర్తించే వ్యవస్థే లేదు. ఉదాహరణకు నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఏం జరిగిన్నది అందరికీ తెలుసు. దీనిపై కేంద్రం అధికారిక సమాచారం విడుదల చేయటం లేదు. జీఎస్టీ విషయంలోనూ అంతే. ప్రస్తుతం జీఎస్టీ వసూళ్లు భారీ మొత్తంలో ఉన్నాయని కేంద్రం లెక్కలు విడుదల చేస్తోంది. అయితే సంఘటిత, అసంఘటిత రంగంలో ఉపాధి పొందిన వారివల్లే జీఎస్టీ వసూళ్లు పెరిగాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నిటి ఆయోగ్..ఏం లాభం?
ప్రణాళికా సంఘాన్ని రద్దుచేశాక, మోడీ సర్కార్ 'నిటి ఆయోగ్'ను తీసుకొచ్చింది. 2017లో 'నిటి ఆయోగ్' మూడేండ్ల, ఏడేండ్ల, 15ఏండ్ల ప్రణాళికలను ప్రవేశపెట్టింది. వీటికి సంబంధించి రోడ్‌మ్యాప్ విడుదల చేస్తూ...గొప్ప గొప్ప లక్ష్యాల్ని అందులో వల్లించింది. అంతకు మించి కేంద్రం చేసిందేమీ లేదు. ఉదాహరణకు విద్యకు సంబంధించి నిధుల సమీకరణ ఎలా పెంచుకోవాలన్నది మూడేండ్ల ప్రణాళికలో నిటి ఆయోగ్ పేర్కొనలేదు. మరోవైపు విద్యారంగంలో ప్రమాణాలు కొనసాగించటం కోసం రాష్ట్రాలు తంటాలు పడుతున్నాయి. కేంద్రం నుంచి నిధుల విడుదల లేకపోవటం వల్లే ఈపరిస్థితి వచ్చిందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.