Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాల్కనీ స్లాబ్ కూలి నలుగురు దుర్మరణం
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
సాయంత్రం బాల్కని కింద కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్న ఐదుగురిపై ఒక్కసారిగా స్లాబ్ కూలింది. దాంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇందులో ఇంటి యజమాని, వస్త్ర దుకాణం నిర్వాహకుడితోపాటు అతని ఇద్దరు స్నేహితులు ప్రాణం కోల్పోయారు. ఈ విషాధ ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, ప్రత్యక్షసాక్షి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని శ్రీరామ్‌నగర్ మెయిన్ రోడ్డుపై ఉన్న గుండ్లపల్లి దశరథకు చెందిన రెండంతస్తుల బిల్డింగ్ మొదటి అంతస్తు బాల్కనీ సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో బాల్కనీ కింద కూర్చున్న ఇంటి యజమాని గుండ్లపల్లి దశరథ(70), సుంకే ఉపేందర్(40), తంగళ్ళపల్లి శ్రీనాథ్(40) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సుంచు శ్రీను(40)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ఆ బిల్డింగ్‌లోనే బ్యాటరీ షాప్ నిర్వహిస్తున్న గిరికి కూడా గాయాలయ్యాయి. ఆయనను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
మృతుల్లో ముగ్గురు స్నేహితులు
ప్రమాదంలో మరణించిన సుంచు శ్రీను, తంగళ్ళపల్లి శ్రీనాథ్, సుంకే ఉపేందర్ స్నేహితులు. వీరు పాఠశాల స్థాయి నుండే క్లాస్మెంట్స్. శ్రీను ఆ బిల్డింగ్‌లో బట్టల దుకాణం నిర్వహిస్తుండగా.. ఆయనను కలిసేందుకు వచ్చిన ఇద్దరు స్నేహితులు ఈ ప్రమాదంలో ప్రాణం కోల్పోయారు.
రోడ్డు వెడల్పు వెడల్పులో పోవాల్సింది..
యాదాద్రి డెవలప్మెంట్లో భాగంగా మెయిన్ రోడ్డు విస్తరణలో ప్రస్తుతం కూలిన బాల్కనీ పోనుంది. ఇప్పటికే అధికారులు మార్కింగ్ చేసిన దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంకా తొలగించలేదు. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది.