Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ అభివృద్ధి సాధిస్తే దేశం సాధించినట్టే
- కాళేశ్వరంతో హైదరాబాద్ తాగునీటి కష్టాలు తీరాయి
- నీళ్లు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు మెరుగ్గా ఉంటేనే
- అభివృద్ధి : కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
- ఆర్ఆర్ఆర్కు శంకుస్థాపన చేస్తా : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'మూడు నెలల్లో తెలంగాణకు వస్తా.. త్రిబుల్ ఆర్(రీజినల్ రింగురోడ్డు)కు శంకుస్థాపన చేస్తా..అందుకు సంబంధించిన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని సూచిస్తున్నా' అని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తెలంగాణ ప్రగతిశీల ప్రాంతమనీ, ఇది ప్రగతి సాధిస్తే దేశం అభివృద్ధి సాధించినట్టేనని చెప్పారు. ఇది ట్రైలర్ మాత్రమేననీ, ఇంకా అభివృద్ధి చేసి చూపుతామని హామీనిచ్చారు. త్రిబుల్ ఆర్తో తెలంగాణ ఆర్థికంగా వేగంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఎన్హెచ్ఐఏ ఆధ్వర్యంలో పలు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నీళ్లు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు బాగుంటేనే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయనీ, అందుకే తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దమే తమ లక్ష్యమని ప్రకటించారు. రోడ్ల విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరిగి పేదరికం తగ్గుతుందనీ, వ్యవసాయ రంగ ఉత్పత్తుల రవాణా వేగతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014 వరకు తెలంగాణలో 2,511 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులుంటే...కేంద్రంలో తమ ప్రభుత్వం వచ్చిన ఎనిమిదేండ్లలో 4,996 కిలోమీటర్లకు విస్తరించామనీ, వంద శాతం వృద్ధి సాధించామని తెలిపారు. తెలంగాణలోని 33 జిల్లాలకు గానూ 32 జిల్లాలు జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం గర్వకారణంగా ఉందని చెప్పారు. మిగతా ఒక్క జిల్లాలోనూ జాతీయ రహదారి వేయిస్తామని హామీనిచ్చారు. తెలంగాణలో రోడ్ల కోసం రూ.3 లక్షల కోట్లకుపైగా ఖర్చుపెట్టామన్నారు. అమెరికా రోడ్లకు ధీటుగా తెలంగాణ రోడ్లను తీర్చిదిద్దుతున్నామన్నారు. దేశంలో 26 గ్రీన్ ఎక్స్ఎస్ హైవేలుంటే అందులో ఐదు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయని వివరించారు. ఎన్‌హెచ్-65 విస్తరణ ఆవశ్యకతను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్లమెంట్ దృష్టి తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో జాతీయ రహదారులు కీలక పాత్ర పోషిస్తున్నాయనీ, వాటి వెంట ఇండిస్టీయల్, లాజిస్ట్రికల్ పార్కులు ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ సర్కారుకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు అడగ్గానే ఇప్పించామనీ, ఇప్పుడు దాని ప్రతిఫలం కనిపిస్తోందని చెప్పారు. కాళేశ్వరం నిర్మాణంతో హైదరాబాద్ తాగునీటి కష్టాలు తీరాయన్నారు. కేంద్ర సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..తమ ప్రభుత్వం బడ్జెట్లో సింహభాగం రోడ్ల నిర్మాణానికే ఖర్చుపెడుతున్నదని చెప్పారు. విదేశీయులు మన జాతీయ రహదారులను చూసి కొనియాడుతున్నారన్నారు. తెలంగాణలో త్రిబుల్ ఆర్ గేమ్ చేంజర్‌గా మారబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ, మహిళా సంఘాలకు రుణాలు, గ్రామపంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తున్నదనీ, కిలో రూపాయి బియ్యం పథకంలో రూ.30ని కేంద్రమే భరిస్తున్నదని వివరించారు. ఉపాధి హామీచట్టం నిధుల నుంచే శ్మశానవాటిక నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ..గడువులోగా త్రిబుల్ ఆర్ భూసేకరణను పూర్తిచేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వీకేసింగ్, ఎంపీ కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత రాజాసింగ్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నేషనల్ హైవే అథారిటీ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ క్యాడర్‌పై కిషన్‌రెడ్డి గుస్సా
ఇదేం పద్ధతి.. ప్రభుత్వ కార్యక్రమం పక్కనున్నోళ్లను ఆపండయ్యా అంటూ ఆగ్రహం
అది ప్రభుత్వ అధికార కార్యక్రమం. రాజకీయ పార్టీల నినాదాలకు తావు ఉండకూడదు. కానీ, జాతీయ రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమం బీజేపీ కార్యకర్తల అనుచితతీరుతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డినే గుస్సా కావాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడేందుకు మైకు వద్దకు వెళ్లగానే..బీజేపీ కార్యకర్తలు 'భారత్‌మాతాకి జై..జై శ్రీరాం..మోడీ నాయకత్వం వర్థిల్లాలి.. బీజేపీ జిందాబాద్..' అంటూ పెద్దపెట్టున నినాదాలు అందుకున్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించేందుకు చూడగా నినాదాల తీవ్రతను పెంచారు. అదేసమయంలో గట్టిగా ఈలలు, కేకలు వేయడం మొదలుపెట్టారు. రెండు, మూడు నిమిషాలు ఓపిక పట్టిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేచి మైకు వద్దకెళ్లి వద్దని వారించారు. అయినా, కార్యకర్తలు తమ తీరును మార్చుకోలేదు. దీంతో ఒకింత అగ్రహానికి గురైన కిషన్‌రెడ్డి 'ప్లీజ్. దయచేసి అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి. ప్లీజ్. ఇది పద్ధతిగాదు. ఇది ప్రభుత్వ కార్యక్రమం దయచేసి సహకరించాలి. అందరూ కూర్చోండి. పక్కనున్నవాళ్లను ఆపండయ్యా. ఏరు బాబు ఆగండి. అరె అర్థం కావట్లేదా? ఏమాత్రం గౌరవం ఉన్నా ఆపండి' అని తీవ్రస్వరంతో అనటంతో కార్యకర్తలు ఆగారు. ప్రోగ్రాం అసాంతం బీజేపీ అధికారిక కార్యక్రమంగా జరగటం విస్తుగొల్పింది. బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా వేదికపైకి ఆహ్వానించారు.