Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూమిపూజ చేసిన హైకోర్టు జస్టీస్ రాజశేఖర్ రెడ్డి
- కోర్టు ఆవరణంలో ఘనంగా 75వ వజ్రోత్సవ వేడుకలు
- కోర్టు ఆవరణంలో న్యాయదేవత విగ్రహ ఆవిష్కరణ
- సీనియర్ న్యాయవాదులకు ఘన సన్మానం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నం కోర్టు ఏర్పాటై 75వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ తరుణంలో హై కోర్టు సహకారంతో ఆదివారం రూ.21కోట్ల40లక్షలతో నాలుగు కోర్టుల నూతన భవన సముదాయానికి హైకోర్టు జస్టీస్ జడ్జీ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ అనిరెడ్డి అభిషేక్ రెడ్డి, లక్ష్మణ్ వెంకటేశ్వర్ రెడ్డి, సంతోష్‌రెడ్డి, ఆర్డీవో వేంకటాచారి, న్యాయవాదులతో కలిసి శంకుస్థాపన చేేశారు. అనంతరం న్యాయస్థానం సముదాయంలో న్యాయదేవత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలాజీ గార్డెన్లో ఏర్పాటు చేసిన సభలో జస్టీస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు.. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయస్థానాల్లో మౌలిక వసతులతో అవసరం ఉన్నదన్నారు. మౌలిక వసతులను సమకూర్చుకోవడంలో బార్ అసోసియేషన్ కార్యవర్గం కీలక పాత్ర పోషించారని అన్నారు. స్థానికులైన జస్టిస్ అభిషేక్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రస్తుతం నాలుగు న్యాయస్థానాల ఏర్పాటుకు భూమిపూజ చేయడం జరిగిందని తెలిపారు. న్యాయవాదులు శ్రద్ద, నిజాయితీతో పని చేసి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. న్యాయం కోసం న్యాయవాదులు పని చేయాలని గుర్తు చేశారు. అనంతరం సీనియర్ న్యాయవాదులను, గతంలో కోర్టులో విధులు నిర్వహించిన న్యాయమూర్తులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్ తిరుపతి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ కుమార్, ప్రధాన కార్యదర్శి ముద్ధం వెంకటేశం, తహాసిల్దార్ అనిత, అదనపు జిల్లా న్యాయమూర్తి సుదర్శన్, రాజగోపాల్, మంజరి, సీనియర్ న్యాయమూర్తులు కిరణ్, ఇందిరా, రాజు, అనామిక, సంఘం ఉపాధ్యక్షులు జైపాల్ నాయక్, సంయుక్త కార్యదర్శి కసరమొని కృష్ణ, కోశాధికారి మిర్యాల జగన్, అరుణ్ కుమార్, జిల్లా న్యాయవాదులు, పట్నం న్యాయమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.