Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీటీసీ అనురాధ పత్య నాయక్.
నవతెలంగాణ-ఆమనగల్
కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తుందని జిల్లా సాంఘీక సంక్షేమ స్టాండింగ్ కమిటీ చైర్మెన్, జడ్పీటీసీ సభ్యులు నేనావత్ అనురాధ పత్యనాయక్ అన్నారు. ఆదివారం ఆమనగల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి జడ్పీటీసీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన దానికి విరుద్ధంగా కార్పొరేట్ సంస్థలకు అచ్ఛేదిన్, సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు చచ్చేదిన్గా ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాకముందు గ్యాస్ ధర రూ.420లు,నేడు గ్యాస్ ధర రూ. 1,050 లకు చేరుకుందన్నారు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకుని పేద మధ్యతరగతి కుటుంబాలు కొనలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అదాని, అంబానీల కమీషన్లకు కక్కుర్తిపడి పేద మధ్యతరగతి కుటుంబాలను నట్టేట ముంచుతున్న మోడీ సర్కార్కు రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు సరితపంతు నాయక్, సర్పంచ్ సోనాశ్రీను నాయక్, కౌన్సిలర్లు రాధమ్మ వెంకటయ్య, సోనిజైరామ్ నాయక్, టీఆర్ఎస్ అధ్యక్షురాలు కృష్ణవేణి, అలివేలు, వెంకటమ్మ, శివలీల, ఎల్లమ్మ, జంగమ్మ, లక్ష్మమ్మ, ఎల్లమ్మ, ఈశ్వరమ్మ, సుశీల తదితరులు పాల్గొన్నారు.