Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో అద్భుతమైన ఆవిష్కరణలు
- గమన్ స్కల్ బేస్ లైవ్ సర్జరీ ముగింపు కార్యక్రమంలో డీఐజీ ఏవీ.రంగనాథ్
నవతెలంగాణ-మియాపూర్
తెలంగాణా రాజధాని హైదరాబాద్ మహానగరం, వైద్యసేవల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో రాణిస్తూ వైద్య రాజధానిగా రూపాంతరం చెందుతోందని డీఐజీ, హైదరాబాద్ అడిషినల్ సీపీ(ట్రాఫిక్) ఏవీ.రంగనాథ్ తెలిపారు. గచ్చిబౌలిలోని గమన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో రెండు రోజుల పాటు స్కల్ బేస్ లైవ్ సర్జరీ వర్క్‌షాప్ నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన వర్క్ షాప్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు జరిగాయని, ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగరానికి సైతం ఎంతో పేరు ప్రతిష్టలు వచ్చాయన్నారు. విశ్వనగరంగా వెలుగొందుతున్న హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలతో ప్రజలకు వైద్యసేవలను అందిస్తోందన్నారు. గమన్ గ్రూప్ ఆఫ్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో సహస్ర ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన స్కల్ బేస్ లైవ్ సర్జరీ వర్క్ షాప్ వైద్య విధానంలో నూతన ఆవిష్కరణకు నాంది పలుకుతుందన్నారు. కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్‌గా అంతర్జాతీయ స్థాయిలో విశేష సేవలందించిన ఈఎన్టీ వైద్య నిపుణులు డా.జానకిరామ్ వంటి వారి నేతత్వంలో ఈఎన్టీ వైద్యులకు సులభమైన రీతిలో లైవ్ సర్జరీ నిర్వహణలో మెలకువలను నేర్పించడం అభినందనీయమన్నారు. డా.జానకిరామ్ అంతర్జాతీయ ఈఎన్టీ ప్రొఫెసర్‌గా రాణిస్తూనే, భావి వైద్యులకు మార్గదర్శకంగా జానకిరామ్ నిలుస్తున్నారంటూ కొనియాడారు. అంతకుముందు గమన్ గ్రూప్ ఆఫ్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డా.నందకిషోర్ ఎర్రంశెట్టి మాట్లాడుతూ డీఐజీ ఏవీ.రంగనాథ్ కోవిడ్ సమయంలో చూపిన తెగువ, రోగుల పట్ల చూపిన మానవత్వం జీవితంలో మరువలేమన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆయన చేస్తున్న చర్యలు ప్రజల అభిమానం పొందుతున్నాయన్నారు.
స్కల్ బేస్ సర్జరీతో మెరుగైన ఫలితాలు
డా. జానకిరామ్, ఈఎన్టీ అంతర్జాతీయ వైద్యనిపుణులు స్కల్ బేస్ సర్జరీతో మెరుగైన ఫలితాలు లభిస్తాయని డా.జానకిరామ్ తెలిపారు. గమన్ ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈఎన్టీ వైద్యంలో తాము చూపిన స్కల్ బేస్ సర్జరీ కారణంగా 98 శాతం మంచి ఫలితాలను సాధిస్తున్నామన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సేవలను నూతన వైద్యులకు నేర్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అతి తక్కువ వైద్య ఖర్చులతో సామాన్యులకు సైతం వైద్యసేవలందించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్న గమన్ ఆసుపత్రులు, సహస్ర ఈఎన్టీ ఫౌండేషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు. సేవా దక్పథంతో వారు చేస్తున్న కషికి తనవంతు సహకారమందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎన్టీ వైద్యులు శ్రీహర్ష తిక్క, చాణక్య, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.