Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి
నవతెలంగాణ-కల్చరల్ రిపోర్టర్
సమాజ నిర్మాణంలో కీలక ప్రాధాన్యత పోషిస్తున్న నాటక కళా ప్రక్రియను ఆదరిస్తే సంస్కారాన్ని నిలిపినట్లే అని ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభ ప్రధాన వేదిక పై జనతా సేవా సమితి సంస్థ నిర్వాహణ లో వర కవుల నరహరి రాజు రచించిన ' కృష్ణార్జున విలాసం( సుభడ్రార్జునుల కల్యాణం కథ) పద్య పౌరాణిక నాటక ప్రదర్శన మంగళవారం జరిగింది. ఈ సభా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆచార్య వెంకట రెడ్డి పాల్గొని మాట్లాడుతూ చెమకూరి వెంకట కవి రచించిన విజయ విలాసం కథాంశంలో కొంత భాగాన్ని తీసుకుని నరహరి రాజు నాటకంగా పాండితీ ప్రతిభతో రచించారని ప్రశంసించారు. అధ్యక్శత వహించిన హెచ్ఎమ్డిఏ ప్రత్యేక అధికారి రాంకిషన్ మాట్లాడుతూ తెలుగు నాటకం భాషను పరిపుష్టం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షులు తడికమల్ల రామచంద్ర రావు మాట్లాడుతూ నేడు చానెల్స్‌లో ప్రసారం అయ్యే కార్యక్రమాలు కుటుంబ సమేతంగా చూసే విధంగా లేవన్నారు. నాటకమే శాశ్వత కళగా నిలచి ఉంటుందన్నారు. బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలే కళలను కాపాడాలన్నారు. కృష్ణార్జున విలాసం నాటకంలో కృష్ణునిగా డీఎస్.రాజు నటన, భాషోచ్చారణ ఆకట్టుకోగా అర్జునునిగా మార్కండేయ రాజు, బలరాముగా శ్రీనివాస్, దుర్యోధనునిగా కాశయ్య పాత్రోచితంగా నటించారు.