Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారానికి కొందరికి చొప్పున పని
- మిగిలినోళ్లకు తరువాత వారం
- ఏక కాలంలో పని చేస్తే కొలతలకు ఇబ్బందులున్నరు
- కొలతల ప్రకారం పని చేస్తలేరని రెండు వారాల కొలతల నిలిపివేత
- అందుకే కూలీ గిట్టుబాటు కావడం లేదు
- ఉపాధి అధికారుల తీరుపై కూలీల అభ్యరతరం
- పంచాయతీ కార్యాలయం ఎదుట కూలీల ఆందోళన
- దిగొచ్చిన మండల స్థాయి అధికారులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
'అందరికీ కాదు.. కొందిరకే 'ఉపాధి'. 100 గ్రూపులకు ఒకే సారి పని కాకుండా వారానికి కొందరు చొప్పున ఉపాధి పని కల్పిస్తాం. మిగిలినోళ్లకు మరో వారం పనిస్తాం.100 గ్రూపుల్లోని 1200 మంది ఒకేసారి పనిస్తే ఏక కాలంలో కొలతలకు ఇబ్బందులవుతున్నాయి. వారిలో సగం మందికి మాత్రమే ఈ వారం పనిస్తే కొలతలకు ఇబ్బంది కాదు. కూలీలు మెజర్మెంట్ ప్రకారం పని చేస్తా లేరు. అందుకే కూలి గిట్టుబాటు కావడం లేదు. తక్కువ కూలీ పడుతుంది. అందుకనే రెండు వారాల పేమెంట్ చేయకుండా నిలిపేసినం. మెజర్మెంట్ ప్రకారం పనులు చేయాల్సి ఉందని' చెప్పిన ఉపాధిహామీ అధికారుల మాటలకు కూలీలు ఆగ్రహించారు. పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో మండల స్థాయి అధికారులు దొగొచ్చారు. కూలీలతో చర్చించారు. పని కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ పని కల్పిస్తామన్నారు. కూలీలు తమ ఆందోళన విరమించారు. ఇది ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లిలో గురువారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు...
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లిలో సుమారు 100 గ్రూపులకు చెందిన 1200 మందికి పైగా కూలీలు నిత్యం ఉపాధిహామీ కూలీలు ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారు. అయితే వందల మంది కూలీలు ఒక్క సారిగా పనులు చేస్తుండటంతో ఉపాధిహామీ అధికారులు కొలతలు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కొలతలకు వెళ్లే సమయానికి కూలీలు కూడా ఇంటి ముఖం పడుతున్నారు. దాంతో కొలతలకు పనులు చూపించేందుకు కూలీలు, మేట్లు అందుబాటులో ఉండటం లేదన్న సాకులో కూలీలను విభజించి పనులు చేయించాల ని సంకల్పించారు. ఆ ప్రకారం ఏక కాలంలో 1200 మందికి పని చెప్పకుండా వారిలో సగం మందికి మాత్రమే ఒక వారం పని కల్పించి, మిగిలిన సగం మందికి మరుసటి వారం పని కల్పించనున్నట్లు ముందు రోజు అధికారులు కూలీలతో చెప్పారు. ఆ ప్రకారమే డిమాండ్‌ను స్వీకరిం చారు. ప్రతి వారం గురువారం నుంచి కొత్త పనులు ప్రారంభమవుతున్న దృష్టి ఈ వారం కొందరికి మాత్రమే మస్టర్లు జారీ చేశారు. దీంతో కొందరు కూలీలు పనులు వెళ్తేంటే, మరికొందరు ఇంటి వద్దనే ఉండాల్సి వచ్చింది. దాంతో కూలీలు ఒక్కసారిగా ఆగ్రహించారు. తమకెందుకు పని కల్పించడంలేదని ఆందోళనకు గురయ్యారు. పని కోసం దరఖాస్తు చేసుకున్న తమకందరికీ పని కల్పించాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం పోల్కంపల్లి గ్రామపంచాయతీ ఎదుట వందలాది మంది కూలీలు ఆందోళనకు దిగారు. తమకు ప్రతిరోజూ పని కల్పించాలని వేడుకున్నారు. మండల స్థాయి అధికారులు వచ్చే వరకూ ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించారు. మండల స్థాయి అధికారులు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనకు దిగారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు గ్రామపంచాయతీ ఎదుట ఆందోళనకు దిగారు. ఉపాధి హామీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఇబ్రహీంపట్నం ఎంపీడీవో క్రాంతి, ఏపీవో లలిత, టెక్నికల్ అసిస్టెంట్ పద్మ, పంచాయతీ కార్యదర్శి రాధ గ్రామానికి చేరుకున్నారు. సర్పంచ్ అండాలు, ఎంపీటీసీ మంగ, ఉపసర్పంచ్ జంగారెడ్డి ఆందోళనకు దిగిన ఉపాధిహామీ కూలీలతో చర్చలు జరిపారు. పని కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉపాధి పని కల్పిస్తామని ఎంపీడీఓ హామీ ఇచ్చారు. ఆ మేరకు అన్ని గ్రూపులకు పని కల్పించేందుకు పని కోసం దరఖాస్తులు స్వీకరించారు. నేటి నుంచి వారందరికీ పని కల్పిస్తామని చెప్పారు. అయితే కొలతల ప్రకారం పని చేస్తే రోజుకు రూ.257 కూలీ వస్తుందని కూలీలకు ఎంపీడీవో క్రాంతి గుర్తు చేశారు. కొలతల ప్రకారం పని చేయకుండా వస్తే కూలీ గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదన్నారు. కూలీలకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఉపాధిహామీ అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం తప్పకుండా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పనులు చేయాలని చెప్పారు. అందుకు మేట్లు కూడా కొలతలను ఇస్తూ పని చేయించాలన్నారు. అధికారుల హామీతో కూలీలు శాంతించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గసభ్యులు పి.జగన్, నాయకులు వెంకటేష్ తదితరులున్నారు.