Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాలయ కల్పించడమే లక్ష్యం
- మన ఊరు-మనబడి కార్యక్రమానికి రూ.7300 కోట్లు
- కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ-షాబాద్
విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు సాధించాలంటే పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోటి రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన మౌలిక వసతులను ఏడబ్ల్యూఎస్ డైరెక్టర్ సాజి పీకే, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యలతో కలిసి శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యాగులు, క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్య, వైద్యం కోసం అమెజాన్ వెబ్ సర్వీసు ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. అందులో భాగంగానే హైతాబాద్‌లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా సంస్థ మౌలిక వసతులు కల్పించినట్టు తెలిపారు. అలాగే మహేశ్వరంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కరోనా నేపథ్యంలో సమాజ సేవలో ముందుండి సేవలు అందించినట్టు తెలిపారు.చేవెళ్ల ప్రభుత్వాస్పత్రుల్లో ఐసీయూను, అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి పేద రోగులకు సేవలందించే విధంగా సంస్థ చూస్తుందన్నారు. ప్రచారానికి పోకుండా సమాజ సేవ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా అమెజాన్ వెబ్ సర్వీసు అందిస్తున్న సేవలను ఆమె కొనియాడారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యా, వైద్యానికి సీఎం కేసీఆర్ ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రతి పాఠశాలలో అన్ని వసతులను ఉండేందుకు మనఊరు-మన బడి కార్యక్రమానికి రూ.7300 కోట్లు నిధులు కేటాయించినట్టు తెలిపారు. పాఠశాలలో పన్నెండు విభాగాల విభజించి అన్ని రకాలుగా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ రంగంలో ప్రపంచంతో పోటీ పడుతున్న మనదేశం ముందంజలో ఉండాలంటే విద్యార్థులు బాగా చదివి, మంచి నైపుణ్యాన్ని సాధిం చాలన్నారు. వచ్చే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. పరీక్ష సమయంలో ఆందోళన చెందకుండా బాగా రాసిన ప్పుడే ఫస్ట్ క్లాస్‌లో పాసవుతారని విద్యార్థులకు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో వేయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి, విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అంది స్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఏడున్నరేండ్ల కాలంలో నాలుగు వందల నుంచి 1050 ఇంటర్మీడియట్ కళాశాలలగా మార్చినట్టు గుర్తుచేశారు. అలాగే ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. విదేశాల్లో చదవాలనుకునే నిరుపేద విద్యార్థులకు కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.20 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్టు ఆమె వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు చాలా వరకు ఉన్నత స్థాయికి ఎదిగారనీ, అలాగే మీరు కూడా కావాలని విద్యార్థులకు సూచించారు. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన తాము ఉన్న ఊరునూ, చదివిన బడిని మర్చిపోవద్దన్నారు. ఊరు బాగుకోసం బడి ఎదుగుదల కోసం తమవంతు సాయాన్ని అందించాలని తెలిపారు. బడి అభివృద్ధికి కోటి రూపాయల వరకూ ఆర్థిక సాయం చేసిన వారి పేరును పాఠశాలకు పెట్టేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ నక్కలపల్లి హైతాబాద్ బ్రిడ్జి కింద నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, డీఈఓ సుశిదర్ రావు , ఆర్డీవో వేణుమాధవ్, ఎంపీడీవో అనురాధ, ఎం ఈవో శంకర్ రాథోడ్, పీఆర్డీఈ విజయకుమార్, ఏఈ దివ్య, సర్పంచులు మల్లేష్, ప్రభాకర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు జనార్ధన్‌రెడ్డి, ఖాజామియా, తదితరులు ఉన్నారు.