Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుణ ప్రణాళిక సిద్ధం
- వేసవి దుక్కులు సిద్ధం చేస్తున్న అన్నదాత
- పెరగనున్న పత్తి సాగు
- వరి సాగుకు అన్నదాత ప్రాధాన్యత
- సొసైటీల ద్వారా పచ్చిరొట్ట, వరి విత్తనాల సరఫరా
- సబ్సిడీపై సోయాతో పాటు ఏ ఇతర విత్తనాల సరఫరాకు మినహాయింపు
- ప్రభుత్వానికి ప్రతిపాదించిన జిల్లా వ్యవసాయశాఖ
వానాకాలం సీజన్లో పంటల సాగుకు అన్నదాత సిద్ధమవుతున్నాడు. వేసవి దుక్కులు దున్నుకుంటున్నారు. ఎరువులు చల్లుకుని సాగుకు సమాయత మవుతున్నాడు. తను సాగు చేసే పంటకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనిలో నిమగమయ్యాడు. ఇక జిల్లా వ్యవసాయాధికారులు సాగు ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆమోదానికి నివేదించారు. ఇప్పటికే పంట రుణ ప్రణాళికను ప్రకటించారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ముందస్తుగానే విత్తనాలు, ఎరువులు సరఫరా
రైతుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందసు ్తగానే అందుబాటులో ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లా పరిధిలో సాగుకు అవసరమైన విత్తనాలను సరఫరా చేసేందుకు ముందస్తు ఏర్పాట్లలో నిమగమైంది. వానాకా లంలో రైతులు వేసే విత్తనాలకు అనుగుణంగా పచ్చిరొట్టతో పాటు విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్‌ల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ సారి వరి సాగు అత్యధికంగా సాగయ్యే అవకాశాలున్నాయని వ్యవసాయాధి కారులంటున్నారు. అందుకు కావాల్సిన వరి రకాలను కూడా రైతులకు అందించేందుకు స్టాక్‌ను సిద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వానికి సాగు ప్రణాళిక అందజేత
రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారులు వానాకాలం సీజన్లో సాగుకు సన్నదమవుతున్నారు. ఇప్పటికే వ్యవసా య అధికారులు వానాకాలం ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, వివరాలను కూడా నివేదికల్లో పేర్కొన్నారు. జిల్లాలో ఏయే పంటలను ఎక్కువగా వేస్తారో? ఆ ప్రణాళికల్లో పొందుపర్చారు. ప్రభుత్వ విత్తనాభివద్ధి సంస్థ ద్వారా సరఫరా చేసే విత్తనాలతో పాటు ప్రయివేటు సంస్థల ద్వారా ఏ విత్తనాలను సరఫరా చేస్తారో? అందులో పొందుపర్చారు. జిల్లా పరిధిలో ఈ వానాకాలం సుమారు 3 లక్షల ఎకరాలకు పైగా సాగు కానుంది. జిల్లా పరిధిలో నాలుగు లక్షల ఎకరాల వరకు పంటలు సాగవుతాయని అంచనా వేయగా.. అందులో 60వేల ఎకరాల వరకు వరి వేస్తారని అంచనా వేశారు. మిగతా లక్ష ఎకరాల వరకు పత్తి సాగుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సోయా, కంది, పెసర, మొక్కజొన్న పంటలు ఎక్కువగా వేస్తారని పొందుపర్చారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి పంపించిన నివేదికల్లో స్థానిక వ్యవసాయ అధికారులు పొందుపర్చారు. అన్ని మండలాల పరిధిలో సరఫరా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర విత్తనాభివద్ధి సంస్థ ద్వారా వానా కాలం సీజన్ సాగు కోసం విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. అన్ని మండలాల పరిధిలో సరఫరా చేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. పంటలు వేసే ముందు రైతులు వేసే పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లా పరిధిలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల ద్వారా ఈ విత్తనాలను సరఫరా చేసేందుకు అందుబాటులో ఉంచారు. సబ్సిడీతో పాటు వరి విత్తనాలను సబ్సిడీ లేకుండా సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం పచ్చిరొట్టతో పాటు వరి విత్తనాలు అందుబాటులో ఉండగా.. మరికొన్ని రోజుల్లో పప్పు దినుసుల విత్తనాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
65 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా పచ్చిరొట్ట విత్తనాలు దంచ క్వింటాలు రూ. 6,325 ఉండగా, 65 శాతం సబ్సిడీపైన రూ.2,214లకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లను చేశారు. సన్‌హెంప్ రకం విత్తనాలు క్వింటాలు రూ.8,325 ఉండగా, 65 శాతం సబ్సిడీపైన రూ.2,914 అన్ని కేంద్రాల్లో సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లిపెసర క్వింటాలు రూ.8,850 ఉండగా, 65 శాతం సబ్సిడీపై రూ.3,398 సరఫరా చేస్తున్నారు.
వరి విత్తనాల సరఫరాకు ఏర్పాట్లు
జిల్లాలో ఎక్కువగా సాగయ్యే వరి విత్తనాలను సరఫరా చేసేందుకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఏర్పాట్లను చేస్తుంది. జిల్లాలో ఎక్కువగా సాగు చేసే వరి ఎంటీయూ 1010 రకం వరి విత్తనాన్ని రైతులు ఇష్టపడుతున్నారు. అదే విధంగా సన్నరకాలను కూడా విత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఎంటీయూ 1010రకం 25కిలోల బ్యాగును రూ.850, బీపీటీ, ఆర్ఎన్ఆర్, జేజీఎల్ 25కిలోల బ్యాగు రూ.850 చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇవే కాకుండా ఇతర రకాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉండడంతో ఇతర రకాల విత్తనాలను కూడా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా దొడ్డు రకాలతో పోలిస్తే సన్న రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తుండడంతో.. వాటిని కూడా అందుబాటులో ఉంచే ఏర్పాట్లను చేస్తున్నారు.
రుణ పరిమితి సిద్ధం
జిల్లాల్లో వ్యవసాయ పంట రుణాలకు సంబంధించిన రుణపరిమితి పెంచుతూ అధికారులు నిర్ణయాలు తీసుకు న్నారు. ఏఏ పంటకు ఎంతెంత పంట రుణం ఇవ్వాలనేదా నిపై బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే వ్యవసాయ సీజన్‌కు సంబంధించి జిల్లాలోని అన్ని ప్రధాన పంటలకు రుణపరిమితి పెంచారు. పత్తి, వరి, జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, మిర్చి, పొద్దుతిరుగుడు తదితర పంటలకు రుణపరిమితి పెంచారు. 120 రకాల పంటలకు సంబంధించి రుణపరిమితి ఖరారు చేసింది. వివిధ రకాల పంటల సాగు ఖర్చు, ఉత్పాదకత, నీటి వసతి, ఆదాయం ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది. రుణపరిమితి నివేదికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ)కి పంపించింది. ఈ సారి ముందుగానే ప్రకటించడంతో రైతులకు కొంత ప్రయోజనం కలిగనుంది. రాష్ట్ర ఫ్రభుత్వం రైతుబంధు పథకం కింద ఏటా ఎకరాకు రూ.10వేల చొప్పున అందిస్తోంది. ఖరీఫ్ సీజన్లో రూ. 5వేలు, రబీ సీజన్లో రూ. 5వేల చొప్పున నేరుగా రైతుఖాతాలో జమ చేస్తోంది. అలాగే కేంద్రం కూడా ఎకరా నుంచి 5 ఎకరాలలోపు ఉన్నవారికి రూ.6వేలు అందిస్తోంది
పంటలకు రుణ పరిమితి ఇలా..
పంటల వారిగా రుణ ప్రణాళికను కేటాయించారు. 2021-22తో పోల్చితే 2022-23లో సాగు రుణ ప్రణాళికను పెంచారు. పత్తి 35,000-38,000నుంచి 38,000-40,000పెంచారు. వరి 34,000-38,000 ఉండగా, 36,000-40,000 పెంచారు. వరి విత్తనోత్పత్తి 42,000-45,000 నుంచి 42,000-45,000 ప్రకటించారు. జొన్న 15,000-20,000 ఉండగా, 16,000-18,000గా నిర్ణయించారు. జొన్న విత్తనోత్పత్తి 20,000-22,000 అమలు చేస్తే దాన్ని ఈ సారి 22,000-25,000గా నిర్ణయించారు. మొక్కజొన్న 25,000-28,000 చొప్పున అమలు చేస్తే.. ఈ సారి 28,000-32,000 నిర్ణయించారు. కంది 17,000-20,000 ఉంటే, ఈ సారి 18,000-21,000 అందజేయనున్నా రు. మినుము 15,000-18,000 నుంచి 18,000-21,000కి పెంచారు. పెస లు 15,000-17,000 ఉండగా ఈసారి కొద్దిగా పెంచి 18,000-21,000 అందజే యనున్నారు. పొద్దుతిరుగుడు 19,000-22,000 నుంచి 22,000-24,000 ఇవ్వనున్నారు. ఇతర పంటలకు కూడా కొంత మేరకు పెంచి సాగు రుణ ప్రణాళికను అందజేయనున్నారు.