Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశువుల కొట్టం కూలి ఆరుగురికి గాయాలు
- నేలకొరిగిన పంటలు, పౌల్ట్రీ, కరెంటు స్తంభాలు
- రైతుల, ప్రజల ఆందోళన ఆదుకోవాలంటు విజ్ఞప్తి
నవతెలంగాణ-కేశంపేట
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలో ఆదివారం ఈదురు గాలులు, వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. పశువుల కొట్టం కూలి ఆరుకి తీవ్ర గాయాలయ్యాయి. వడగండ్ల దెబ్బకు చేతికొచ్చిన వరిచేలు దెబ్బ తిన్నాయి. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు, కరెంటు స్తంబాలు విరిగి పడ్డాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పౌల్ట్రీఫామ్ గోడలు, రేకులతో సహా కూలి నేలమట్టమయ్యాయి. వివరాల్లోకి వెళితే కొం దారెడ్డిపల్లి గ్రామంలో వర్షం, గాలుల కారణంగా కొంత మంది పశువుల కొట్టంలో తల దాచుకోగా కొట్టం కూలి మీద పడడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగా త్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పల్లె ఆనంద్ కుమార్ క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బీభత్సమైన గాలి, వర్షాల కారణంగా లేమామిడి గ్రామంలో డప్పు అంజయ్య, బైండ్ల పెంటయ్య, పార్వతమ్మ, దిద్దల కృష్ణయ్య, నిర్దావెళ్లిలో రహీం, కోడిగంటి యాదయ్య, కాకునూరులో మోయిన్ల ఇంటి పైకప్పు రేకులు గాలికి ఎగిరి పోయాయి. నిర్దావెళ్లి గ్రామానికి చెందిన కోడిగంటి యాదయ్య ఇంటిపై చెట్టు విరిగి పడడంతో రేకులన్నీ ధ్వంసమయ్యాయి. అకాల వర్షం కారణంగా తుర్కపల్లి గ్రామంలో వడగండ్ల వాన, ఉరుము లతో బీభత్సమైన గాలి రావడంతో వరి, ఇతర పంటలు నేలమట్టమయ్యాయి. వడగండ్ల దెబ్బకు వడ్లు రాలి పోయావని కళ్లాలలో ఉన్న వడ్లు తాటిపాల్ (ప్లాస్టిక్ కవర్) గాలికి ఎగిరి పోవడంతో వర్షానికి ఒడ్లు తడిసి ముద్దాయి, కొట్టుకుపోయావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొమ్మదిరేకుల గ్రామంలో గుత్తి పెద్ద పాపయ్య పౌల్ట్రీఫామ్ గోడలు, పైకప్పు రేకులు కూలి నేల మట్టమయ్యాయి.
చెట్లు కూలి రోడ్లకు అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. లేమామిడిలో నారాయణరెడ్డి ఇంటిదగ్గర ప్రయివేటు స్కూల్ బస్సుపై చెట్టు విరిగి పడింది. అక్కడక్కడా కరెంటు స్తంబాలు విరిగి పడడంతో మండలంలోని పలు గ్రామాలలో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రాణనష్టం కాకపోవడంతో మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టం వాటిల్లిన ప్రజలు, పంట నష్ట పోయిన రైతులు ఆందోళనన గురై కంట తడి పెట్టారు. ఆర్థిక సహాయం అందించాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.