Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొట్ట పంటల సాగువైపే రైతుల ఆసక్తి
- జిల్లాలో అత్యధికంగా పత్తి సాగు
- ఉమ్మడి జిల్లాలో సాగు అంచనాలు 11 లక్షల ఎకరాలు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఏడాది పంట సాగుకు రైతాంగం సస్నద్ధమైంది. రైతులు పంట భూముల బాట పట్టారు. భూములు చదును చేసి, సాగుకు సిద్ధంగా ఉన్నారు. తొలకరి చినుకులు పడంగానే విత్తనాలు విత్తనాడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుం టున్నారు. వరుణుడి కోసం రైతులు ఆకాశం వైపు వేచి చూస్తున్నారు. అయితే ఈ వానాకాలం రైతులు మొట్ట పంటల సాగుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇందు కు అనుగుణంగా వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పంటల సాగు విస్తీర్ణం అంచనాలు వేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది సుమారు 11 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టు విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులోకి తేవాలని రైతులు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయం ఎక్కువగా వర్షాధారంపై ఆధారపడి కొనసాగుతోంది. జిల్లాలో సాగు నీటి వసతి లేకపోవడంతో జిల్లా రైతులు మొట్ట పంటల వైపు మొగ్గు చూపుతారు. ఈ ఏడాది జిల్లాలో పత్తి, కందిని రెట్టింపు చేసేందుకు వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాదికి సంబంధించి 4.88 లక్షల ఎకరాల్లో, వికారాబాద్లో 5.96 ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. పత్తి పంట సాగును గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లక్షా40 వేల ఎకరాల వరకు పెంచుతూ నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లాలో వానాకాలం సీజన్లో 4లక్షల88వేల597 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు ప్రణాళికను రూపొందించారు. పత్తి 2లక్షల75వేల050 ఎకరాలు, కందులు 70వేల520, వరి 75వేలు, జొన్న 15వేలు, మొక్కజొన్న 48వేలు, పెసర 352, మినుములు 170, వేరుశనగ 240, ఆముదం 120, సోయాబీన్ 20, ఇతర పంటలు 4,125 ఎకరాల్లో వానాకాలంలో సాగవుతుందని అంచనా వేశారు. గతేడాది వానాకాలంలో 3లక్షల79వేల675 ఎకరాల్లో సాగుకాగా, ఈ ఏడాది లక్ష 08వేల 922 ఎకరాల్లో ఆయా పంటల సాగును పెంచుతూ నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే వరి సాగును సుమారు 60 వేల ఎకరాలకు తగ్గించాలని, జొన్నకు సంబంధించి గతంతో పోలిస్తే ఈ ఏడాది 10 వేల ఎకరాల వరకు పెంచాలనుకుంటున్నారు. ఆయా పంటలకు సంబంధించి 26వేల702 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. అవసరమైన విత్తనాల్లో పత్తి 5లక్షల50వేల100 ప్యాకెట్లు, వరి 18వేల750 క్వింటాళ్లు, జొన్న 600, మొక్కజొన్న 3840, పెసర 28, కందులు 2820, మినుములు 13.6, వేరుశనగ 144, ఆముదం 3, సోయాబీన్ 7, ఇతర పంటలకు సంబంధించి 495 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు నిర్ణయించారు. వికారాబాద్ జిల్లాలో ఈసారి లక్ష 91వేల283 ఎకరాల్లో పత్తి, లక్ష77వేల ఎకరాల్లో కందులు, మొక్కజొన్న 69వేల680, జొన్న 2వేల504, వరి లక్ష12వేల537, పెసర 15వేల316, మినుములు 9వేల305 ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయాధికారులు ఆయా మండలాలవారీగా సేకరించిన వివరాల ప్రకారం అంచనాలు తయారు చేశారు. ఈసారి జిల్లా పరిధిలో పత్తి సాగును 1.91లక్షల నుంచి 2.70లక్షల ఎకరాలకు పెంచడానికి కృషి జరుగుతోంది. కందులు అదనంగా మరో 30వేల ఎకరాల్లో సాగు చేయాలని నిర్దేశించారు.
కావాల్సిన ఎరువులు, విత్తనాలు
పత్తి సాగుకు 3,82,565 విత్తనాల ప్యాకెట్లు, మొక్కజొన్న 3,484 క్వింటాళ్లు, జొన్న 130, కంది 7,080, వరి 28,135, మినుములు 375, పెసర 612 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనాలు తయారు చేశారు. ఈ విత్తనాలను సంబంధిత డీలర్లు ముందుగానే అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టారు. వర్షాలు కురిసే సమయానికి ఆయా ప్రాంతాల్లో రైతులు కొనుగోలు చేసేందుకు వీలుగా విత్తనాలను సిద్ధంగా ఉంచాలని అధికారులు సూచించారు.
దీంతోపాటు వానాకాలంలో 74,547 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనాలు తయారు చేశారు. యూరియా 31,902 మెట్రిక్ టన్నులు, డీఏపీ 11,884, ఎంవోపీ 5,969, కాంప్లెక్స్ ఎరువులు 17,901, ఎస్ఎస్పీ 6,891 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని గుర్తించారు. ఎరువుల కొరత తలెత్తకుండా బఫర్ స్టాకులు ఏర్పాటు చేయించేందుకు అధికారులు నిర్ణయించారు. జిల్లాలో అత్యధికంగా ఎరువులు అవసరమైన ప్రాంతాల్లో బఫర్ స్టాకులు ఏర్పాటు చేయనున్నారు.
సకాలంలో విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాట్లులోకి తెస్తాం
వానకాలం సీజన్లో ఆయా పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందుబా టులో ఉంచుతాం. ఇప్పటికే జిల్లాకు ఎంతమేర విత్తనాలు, ఎరువులు అవసరమనేది అంచనా వేశాం. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది పత్తి సాగును గణనీయంగా పెంచేలా చర్యలు చేపట్టాం.
- గీతారెడ్డి, రంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి