Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించిన కౌన్సిలర్ శ్రీలత, వార్డు మహిళలు
- మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ హామీతో ఆందోళన విరమణ
నవతెలంగాణ-తాండూరు
మున్సిపల్ పరిధిలోని 24వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ గురువారం మహిళలతో కలిసి మున్సిపల్ కౌన్సిలర్ శ్రీలత, వార్డు మహిళలతో కలిసి,మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 24వ వార్డులో కొన్నేండ్లుగా నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించడం లేదన్నారు. ఈ విషయంపై అధికారులకు విన్నవించుకున్నా, పరిష్కరించడం లేదనీ,ఈ సమస్యలు పరిష్కరించే వరకూ ఇక్కడి నుంచి వేళ్లేది లేదనీ, మహిళలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ కార్యాలయానికి చేరుకుని మహిళ ఆందోళనకు మద్దతు తెలిపారు. తాగునీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూనే అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడారు. రాబోయే 20 రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుంటామని, అప్పటి వరకు తాత్కాళికంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని హామినిచ్చారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సాహు శ్రీలత, కాలనీవాసులు,బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.