Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్ధం కానీ పంట రుణ ప్రణాళిక
- స్పందిచని ప్రభుత్వం
ఈ ఏడాది వానాకాలం పంటల సాగుకు రైతులు దుక్కులు దున్ని విత్తనాలు విత్తడానికి రెడీగా ఉన్నారు. చినుకు పడిందంటే పంటలు వేయడమే తరువాయి.. కానీ పంట సాగుకు పంట రుణాలు, పంట పెట్టుబడి సాయం అందక రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు తిప్పలు పడుతున్నారు. పంటలు సకాలంలో వేయాలన్న తపనతో రైతులు విత్తనాల కొనుగోలు కోసం అధిక వడ్డీలకు వ్యాపారులు వద్ద అప్పులు చేయక తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పెట్టుబడి కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు ఇవ్వక.. పంట రుణాలు సకాలంలో అందకపోవడంతో రైతులకు ఆందోళన గురవుతున్నారు. సకాలంలో రైతుబంధు, పంట రుణాలు ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో
- 11లక్షల ఎకరాల్లో పంటలు
- రూ.2వేల కోట్ల పంట రుణాలు అవసరం
- రుణం కోసం రైతుల ఎదురుచూపులు
- ఎరువులు, విత్తనాల కోసం అప్పులు
- పంట పెట్టుబడికి వడ్డీ వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు
సకాలంలో రైతుబంధు, పంట రుణాలు ఇవ్వాలని రైతుల వినతి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పంట రుణాల కోసం ఎదురుచూస్తున్న రైతులు సుమారు 5 లక్షల 28 వేల 556 మంది ఉన్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందుకుగాను పంట రుణాల కింద రూ.2 వేల కోట్లు అవసరం. రంగారెడ్డి జిల్లాలో 4లక్షల 88 వేల ఎకరాలు, వికారాబాద్‌లో 5లక్షల 96వేల ఎకరాలల్లో ఈ ఏడాది వానాకాలం పంటలు సాగు చేయనున్నట్టు అధికారులు అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా రుణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. నేటికి జిల్లాలో పంట రుణాలకు ఎంత బడ్జెట్ కేటాయించాలి... ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలి.. అన్న విషయాన్ని చెప్పకపోవడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు. ఈ ఏడాది వడ్డీ లేని పంట రుణాలు ప్రభుత్వం ఇస్తోందా లేదా అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తం అవుతున్నాయి. జూన్ నెలాఖరు మొట్ట పంటలకు అదునైనా సమయం.. ఈ సమయంలో వర్షాధార పంటలు వస్తే వర్షాలు తగ్గుముఖం పట్టేసరికి పంట వస్తుందని రైతులు ముందస్తుగా భూములు చదును చేసి రెడీగా ఉంచారు. వర్షం పడడమే ఆలస్యం విత్తనాలు విత్తేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. విత్తనాలకు, ఎరువులకు డబ్బులు లేక నిరాశగా అప్పుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది.
పెరిగిన పెట్టుబడి ఖర్చులు
చమురు ధరల పెంపుతో పంట సాగు ఖర్చులు రెండింతలు పెరిగాయి. ఎరువుల, విత్తనాల ధరలతో పాటు పొలం చదును చేసేందుకు ట్రాక్టర్ ఖర్చులు కూడా పెరగడంతో పంట సాగు ఖర్చులు రైతులకు భారమైయ్యా యి. ట్రాక్టర్ కిరాయి గంటకు రూ. 1500 తీసుకుంటు న్నారు. ఎకరం పొలం దుక్కి నుంచి వరి నాటు వేసే వరకు దున్నడానికి సుమారు 5 గంటలు పడుతుంది. ఈ లెక్కన కేవలం ట్రాక్టర్ కిరాయి రూ.7500 అవుతుంది. ఎరువులు రూ. 5 వేలు, నాటుకు రూ.5 వేలు, కలుపు తీతా రూ.3 వేలు, పైమందులు రూ. 2 వేలు, హర్వెస్టింగ్కు రూ. 2500 ఇలా మొత్తం దాదాపు రూ. 30 వేల పెట్టుబడి వస్తోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా పంటకు మద్దతు ధరలను ప్రభుత్వం కేటాయించకపోవడంతో రైతులు అప్పుల పాలు అయ్యే పరిస్థితి ఉంది. దీనికి తోడు ప్రభుత్వం పంట రుణాలు ఇవ్వకపోవడంతో రైతుల వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పంట సాగు పూర్తి అయ్యేక వచ్చిన రాబడి వడ్డీకే సరిపోతుందని, అసలు కట్టే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పంట రుణాలు అందించాలని, అలాగే రైతుబంధు డబ్బులు కూడా జమ చేయాలని రైతులు కోరుతున్నారు.
సకాలంలో పంట రుణాలు ఇవ్వాలి
జిల్లాలో వ్యవసాయం వర్షాధారంపై అధారపడి కొనసాగుతోంది. అందుకు తగ్గట్టుగా వ్యవసాయ శాఖ అధికారులు ఎరువులు, విత్త నాలు అందుబాటులో ఉంచా లి. ప్రభుత్వం సకాలంలో పంట రుణాలు, పంట సాయం రైతుబంధు అందిం చి పంటల సాగుకు సహక రించాలి. ప్రస్తుతం మొట్ట పంటలు వేసే సమయం వచ్చింది. కానీ ఇప్పటికీ ప్రభుత్వం పంట రుణాలపై సడిసప్పుడు లేకుండా వ్యవహరిస్తుంది. తక్షణమే ఈ ఏడాది పే ఆఫ్ స్కేల్ ప్రకారం ఏ పంటకు ఎంత రుణం ఇస్తున్నారో చెప్పాలి. ఈ నెలాఖరులో రైతులకు పంట రుణాలు అందచేయాలి.
- మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ రైతు సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి.