Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరాలు వెల్లడించిన డీసీపీ శిల్పవల్లి
నవతెలంగాణ-మియాపూర్
తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి సోమవారం వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన లియోనాడ్ స్వామి అలియాస్ కన్నా ఉప్పల్ లో ఉంటూ ప్రయివేటు సంస్థలో పనిచేస్తు న్నాడు. ఇతను గతంలో గచ్చిబౌలి, అంబర్పేట్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో పలువురిని బెదిరించిన కేసుల్లో నిందితుడు. ఇతనిపై రౌడీషీట్ కూడా ఉంది. ఇతను యాదగిరిగుట్టలో ఉంటున్న సాయికృష్ణకు పిస్టల్ విక్రయించడానికి స్నేహితుడు చింతకింది సాయిరాంతో కలిసి లియోనాడ్ బేరం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మంజీరా పైప్లైన్ రోడ్డులో కలుసుకునేందుకు ప్లాన్ చేసినట్టు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు మంజీరా పైప్ లైన్ రోడ్డులో నిఘా ఉంచి, వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో తన ద్విచక్ర వాహనంపై వస్తున్న స్వాన్ లియోనార్డ్ అలియాస్ కన్నా అనే పాత నేరస్థుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద ఒక గన్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడి వెనుకే బెలెనో కారులో వస్తున్న సాయికృష్ణ, సాయిరాంలను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఒక కంట్రీ మేడ్ పిస్టల్, ఒక తపంచ, రెండు మ్యాగజైన్ లు,13 బుల్లెట్లు, 6 మొబైల్ ఫోన్లు, ఒక యాక్టివా వాహనం, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. వీరికి తుపాకులను సరఫరా చేసిన బీహార్ రాష్ట్రానికి చెందిన మరో నిందితుడు అలోక్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు లియోనాడ్ స్వామిపై ఇప్పటికే రౌడీషీట్ ఉందని, ఇతనికి 5 కేసుల్లో ప్రమేయం ఉందని, అలాగే మరో ఇద్దరు నిందితులపై కూడా కేసులు ఉన్నట్టు డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఎప్పటికప్పుడు వారి కదలికలను గమనిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ ఏసీపీ కష్ణప్రసాద్, మియాపూర్ సీఐ తిరుపతి రావు, ఎస్ ఓటీ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.