Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ 230 పడకల ఆస్పత్రి నిర్మాణం ,50 పడకల ఆయుష్ ఆస్పత్రి మంజూరు
- పరిగి నియోజకవర్గంలో ఏఎన్ఎం సబ్ సెంటర్ల బిల్లింగ్ నిర్మాణానికి రూ.2 కోట్ల 40 లక్షలు మంజూరు
- ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ-పరిగి
వైద్య ఆరోగ్య శాఖలో 13 వేల పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.గురువారం పరిగి పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని, ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్ థియేటర్‌ను ఆర్ధిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎంపీ డా.రంజిత్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేశ్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు హాస్పిటల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ లో డెలివరీ అయిన మహిళలకు కేసిఆర్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళతో మాట్లాడుతూ హాస్పిటల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, పాలు, పండ్లు అందిస్తున్నా,రాలేదా అని అడిగి తెలుసుకున్నారు. మహిళా బాత్రూంలు పరిశుభ్రంగా లేవని తెలుపగా, తప్పకుండా వాటిని సరి చేయిస్తామని మంత్రి హామీనిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నిర్మించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.
పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి డయాలసిస్ సెంటర్ కావాలని అడుగగా, మంజూరు చేశామనీ, మరో 20 రోజుల్లో డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి తీసుకురావాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజరుని ఆదేశించారు. హాస్పిటల్‌కు కాంపౌండ్ వాల్, పోస్టుమార్టం రూం, జనరేటర్, డిజిటల్ ఎక్స్ రే మిషిన్, ఎక్వూమెంట్స్, మూడు పల్లె దవాఖానాలు, 12 ఏఎన్ఎం సబ్ సెంటర్ బిల్డింగులు కావాలని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అడిగారనీ, వాటన్నిటినీ మంజూరు చేస్తున్నామన్నారు. ఏఎన్ఎం సబ్ సెంటర్ బిల్లింగ్ నిర్మాణానికి రూ.20 లక్షల చొప్పున రూ.2 కోట్ల 40 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ వైద్యం, విద్యను పేద ప్రజలకు అందించాలని ఉద్దేశంతో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టాలని నిర్ణయించారనీ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇస్తున్నామనీ, వచ్చే ఏడాదికి మెడికల్ కళాశాలను పూర్తిచేసి అడ్మిషన్లకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల కావాలంటే 330 పడకల హాస్పిటల్ ఉండాలనీ, ప్రస్తుతం వికారాబాద్‌లో 100 పడకల హాస్పిటల్ ఉందని, మరో 230 పడకల హాస్పిటల్‌ను నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు పరిశీలించడానికి వచ్చేలోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. కళాశాలలో కావాల్సిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డాక్టర్ల నియామకానికి కావాల్సిన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలోనే 33 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వచ్చాయన్నారు. గతంలో 700 స్వీట్లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 2,480 సీట్లు ఉన్నాయని, వికారాబాద్ మెడికల్ కళాశాల పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో 5,240 సీట్లకు పెరుగుతుందన్నారు. పీహెచ్‌సీల్లో డాక్టర్ల పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. రెండు నెలల్లో పర్మినెంట్ డాక్టర్లతో నియామకాలు చేపడతామన్నారు. వికారాబాద్ జిల్లాకు ఒక ఆయుష్ ఆస్పత్రిని కూడా మంజూరు చేస్తున్నామని తెలిపారు. వికారాబాద్ ప్రభుత్వ ఆస్పిటల్ పైననే 50 పడకల ఆయుష్ హాస్పిటల్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్, ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియప్రవీణ్ రెడ్డి, సీఏపీఎస్ చైర్మెన్ శ్యాంసుందర్ రెడ్డి,వైస్ చైర్మన్ భాస్కర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, టీఆర్ఎస్ పరిగి మండల అధ్యక్షుడు అంజనేయులు, పరిగి పట్టణ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, అన్వర్ సెట్,హాజీ పటేల్,మౌలానా, ఫిరంగి వెంకట్రాంరెడ్డి, బషీర్ బై, గౌస్ పాషా , జేఏసీ రవి, మంగు సంత, బల్లాల తదితరులు పాల్గొన్నారు.