Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్ రెడ్డి తెచ్చిన పనులనే మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు
- నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసిందేమీ లేదు
- అభివృద్ధిపై టీఆర్ఎస్ నాయకులు చర్చకు రావాలి
- యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు
నవతెలంగాణ-కొడంగల్
రేవంత్ రెడ్డి హయాంలోనే కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందనీ, టీఆర్ఎస్ ఉనికి కాపాడుకోవడం కోసమే టీఆర్ఎస్ హయాం లో అభివృద్ధి జరిగిందనీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందారం ప్రశాంత్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండీ యూసుఫ్ అన్నారు. కొడంగల్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వాస్పత్రి, గురుకుల గిరిజన పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చినట్టు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు టీఆర్ఎస్ హయాంలోనే అభివద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కొడంగల్ నియోజకవర్గానికి కేటీఆర్, హరీశ్‌రావులు వస్తున్నారంటే ఏయే నిధులు తీసుకువస్తారనీ ఎదురు చూశామన్నారు. కొడంగల్ నియోజకవర్గానికి మంత్రులు రావాలంటే కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, బోంరాస్పేట్, దౌల్తాబాద్ జూనియర్ కళాశాలల, బీసీ, ఎస్టీ, మైనార్టీ ఆశ్రమ పాఠశాలల, ఐటీఐ కళాశాల, మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళా శాలలు కొడంగల్‌కు తీసుకువచ్చిన రోజే కొడం గల్‌కు మంత్రులు రావాలన్నారు. ఆస్పత్రి భవనం ప్రారంభించడమే కాదనీ సరైన సిబ్బంది, పరికరాలు ఉండే విధంగా చూడాలన్నారు. ప్రస్తుతం చేపట్టిన అభివద్ధి పనులు నాసిరకంగా జరుగుతున్నాయనీ, కాంట్రాక్టర్లతో ప్రజా ప్రతినిధులు కుమ్మక్కయి దోచుకుంటున్నారని విమర్శించారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టించు కోవడానికి రూ.3 లక్షలు ఇస్తామనీ, చెప్పి, నేటికీ అమలు చేయలేదనీ ధ్వజమెత్తారు. మంత్రి హరీశ్ రావుకు కొడంగల్ ఎమ్మెల్యే పేరు తెలవకపోవడం అంటే ఎమ్మెల్యేను అవమానించడం తప్ప మరొకటి కాదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో కొడంగల్ ప్రజల కాళ్లు కడుగుతానని చెప్పిన మంత్రి ఎప్పుడు కడుగుతారో చెప్పాలని నిలదీశారు. బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీని ఈడితో మూడు రోజులుగా విచారణ కావాలని చేయిస్తుం దన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం బస్స్ ఛార్జీలు పెంచడంతో ప్రజలు, విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా, డీఎపీ రైతులకు సకాలంలో అందడం లేదనీ, పంట పెట్టుబడి సాయం కూడా అందలేదన్నారు. కొడంగల్‌లో హైవేలో ఉన్న లైట్ల్ రేవంత్ రెడ్డి హయాంలోనే వచ్చాయనీ, ఆయన హాయంలో అభివృద్ధి జరిగిందన్నారు. టీఆర్ఎస్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వచ్చే ఎన్నికలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంజీవరెడ్డి, కౌన్సిలర్ శంకర్‌నాయక్, కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ దామ్ము, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నయూం, ఆనంద్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాల్‌రాజ్, సోమశేఖర్ తదితరులు ఉన్నారు.