Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
- గొట్టిముక్కల గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం
నవతెలంగాణ-వికారాబాద్ రురల్
ఇంటింటికీ సురక్షితమైన మిషన్ భగీరథ తాగునీరు అందించాలని వికారాబాద్ శాసనసభ్యుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శుక్రవారం 5వ విడత పల్లె ప్రగతి, 'మీతో-నేను' కార్యక్రమంలో భాగంగా ఆయన వికారాబాద్ మండల పరిధిలోని ఐనాపూర్, గొట్టిముక్ల గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని అన్ని ప్రధాన రహదారులు తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ రచ్చబండ వద్ద అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐనాపూర్ గ్రామంలో సీసీరోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఐనాపూర్ గ్రామంలో పశు వైద్య అధికారి వారానికి ఒక రోజు రైతులకు అందుబాటులో ఉండాలని పశువైద్య శాఖ వారిని ఆదేశించారు. గొట్టిముక్ల వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడానికి గుం తలు తీస్తున్న ఉపాధిహామీ కూలీల దగ్గరికి వెళ్లి రోడ్డుకు కొంచెం దూరంలో గుంతలు తీయాలని సూచిస్తూ పని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పశువైద్య కాంపౌండర్ గొట్టిముక్ల గ్రామంలో రైతులకు అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందిస్తున్నారని ప్రజలు తెలుపగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. గొట్టిముక్ల గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు తెలుపగా ఎమ్మెల్యే మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి మంచినీటి నల్లా కనెక్షన్ చెర్రలు బిగించి, గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి, ప్రతీ ఇంటికి కచ్చితంగా నల్లా కనెక్షన్ ఇవ్వాలని, లీకేజీలు లేకుం డా నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు సురక్షితమైన మిషన్ భగీరథ తాగునీటిని తాగాలని సూచించారు. గ్రామంలోని బావులపై పైకప్పులు ఏర్పాటు చేసి, 5వ విడత పల్లె ప్రగతి పనులను నిర్లక్ష్యం చేయ కుండా పాడుబడ్డ ఇండ్లు, పెంట కుప్పలు, పిచ్చి మొక్కలు మొదలైన వాటిని శుభ్రం చేసి, గ్రామంలో పరిసర ప్రాంతాలన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామంలో మరియు పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసి మంజూరైన ట్రాన్ఫార్మర్ను బిగించి, ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సేవలు అందించాలని విద్యుత్ శాఖ వారిని ఆదేశిం చారు. అనంతరం గ్రామంలోని రైతులకు కంది విత్తనాల మినీ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.