Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేసిన పనులు నాలుగు కాలాలపాటు నాణ్యతగా ఉండాలన్న సదాశయంతో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. కానీ ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి పనుల నాణ్యత నవ్వుల పాలవుతుంది. గుత్తెదారు ఇష్టారాజ్యం. కౌన్సిలర్ల మాట వింటే ఒట్టు. కోట్ల రూపాయల పననులకు టెండర్ల ప్రక్రియకు తిలోదకాలు. ఇక ఆయా వార్డుల్లో సీసీ రోడ్లు వేయాలంటే కాంట్రాక్టర్‌కు కౌన్సిలర్లే అడ్వాన్స్ ఇవ్వాల్సిందే. ఇంత జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ శూన్యం. ఫలితంగా ప్రజలకు అభివృద్ధి పనులు ఫలితాలు ఇవ్వడం లేదు. ఇక వేసిన సీసీ రోడ్ల సైడ్ల వెంట మట్టి పోసిన పాపాన పోవడం లేదు. నెలల గడుస్తున్నా అలానే వదిలేశారు. రోడ్డుపై పోసిన మట్టిని కూడా తొలగించడం లేదు. దాంతో అవి ప్రమాదకరంగా మారుతున్నాయి. మరికొన్ని వార్డుల్లో సీసీ రోడ్లు వేసేందుకు సదరు గుత్తేదారు తవేసి నడకకు అంతరాయంగా మారినా పట్టించుకోవడం లేదు. ఇది ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో తంతు.
- కౌన్సిలర్ల మాట వినని కంట్రాక్టర్
- రూ.కోట్ల పనుల టెండర్ల ప్రక్రియకు తిలోదకాలు
- సీసీరోడ్లు వేయాలంటే కౌన్సిలర్లు అడ్వాన్సులు ఇవ్వాల్సిందే..
- సీసీరోడ్ల సైడ్ల వెంట మట్టి పోయని వైనం
- భగీరథ, ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ శూన్యం
- ఇది ఇ.పట్నం మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల తంతు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పాలక పక్షంలో వచ్చిన అంతర్గత విభేదాలకు తోడు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అభివృద్ధి పనులపై ప్రభావం పడుతుంది. మున్సిపాలిటీలో సుమారు రూ.5 కోట్ల మిషన్ భగీరథ నిధుల ద్వారా అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది. అయితే ఈ పనులను ఎలాంటి టెండర్ల ప్రక్రియ లేకుండానే సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. అంత మొత్తాన్ని సైతం ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించడంతో పనుల్లో నాణ్యత లోపిస్తుంది. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. అడిగే వారే కరువయ్యారు. అడిగితే పెద్ద సారు నుంచి సదరు కౌన్సిలర్ ఫిర్యాదు. ఆ వెంటనే పెద్ద సారు నుంచి కౌన్సిలర్‌కు ఫోన్ వస్తుంది. చేసేది లేక గమ్మున ఉండాల్సిన దుస్థితి. కనీసం ఇంజనీరింగ్ అధికారులు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఫలితంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు మున్నాల ముచ్చటగా మారుతున్నాయి. నూతన పనులు చేపట్టిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన రోడ్లు సైతం నరకపరంగా మారుతున్నాయి. అందుకు సదురు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం, అవినీతికి నిదర్శణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రోడ్లకు ఇరువైపులా గోతులే..
అంతర్గత సీసీ రోడ్లు వేస్తున్న క్రమంలో రోడ్డుకు ఇరువైపులా మీటరు, అరమీటరు స్థలాన్ని వదిలిపెట్టి సీసీ రోడ్లను వేస్తున్నారు. వదిలిన స్థలంలో రోడ్డు పూర్తయిన తరువాత ఇరువైపులా మట్టితో గోతులు కపాల్సి ఉంది. కానీ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో వేసిన సీసీ రోడ్డు పనుల నాసిరకంగా కొనసాగుతున్నప్పటికీ రోడ్డుకు ఇరవైపులా ఎలాంటి మట్టి పోయకపోవడంతో నెలల తరబడి వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. గోతుల్లో పడి ప్రజలు గాయాల పాలవుతున్నారు. ఇదిలా ఉంటే రోడ్డు వేసిన అనంతరం నీటితో క్యూరింగ్ చేసేందుకు పోసిన మట్టి కట్టలు సైతం నెల తరబడి తొలగించడం లేదు. దాంతో ఆయా రోడ్ల వెంట వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.
కౌన్సిలర్ అడ్వాన్స్ ఇవ్వాలి
కౌన్సిలర్లు తమ వార్డుల్లో ప్రజల వినతులు స్వీకరించిన తర్వాత చేపడుతున్న అభివృద్ధి పనులు కౌన్సిలర్లకు ఇబ్బందులను కొని తెస్తున్నాయి. రోడ్లు వేసేందుకు సదరు కాంట్రాక్టర్లకు ఆ వార్డు కౌన్సిలర్లు లక్షల్లో అడ్వాన్స్ ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. లేకుంటే ఆ పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. అప్పులు ఇచ్చి మరి రోడ్లు వేయించుకునే పరిస్థితి ఇబ్రహీంపట్నం మున్సిపాలి టీలో నెలకొంది. సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ, అక్కడ రోడ్డు అత్యవసరమైనప్పటికీ అవార్డులోని కౌన్సిలర్ మెటీరియల్ కోసం అడ్వాన్స్ ఇవ్వకపోతే అక్కడ పని నెలల తరబడి అయినా కాదు. ఎవరు ఎక్కువ అడ్వాన్స్ ఇస్తే అక్కడే ముందు పని అన్నట్లుగా సదరు కాంట్రా క్టర్ వ్యవహరిస్తున్నారు. కౌన్సిలర్లు ఆ కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టించుకునే పరిస్థితి లేదు. పై స్థాయి నాయకత్వం కనుసన్నాల్లోనే కాంట్రాక్టర్ పనిచేస్తున్నాడే తప్ప మున్సిపల్ కౌన్సిలర్ల మాటవినే పరిస్థితి ఏమాత్రం లేదు.
పర్యవేక్షణ లోపం
సిమెంటు రోడ్ల నిర్మాణం సందర్భంగా ఏ గుత్తేదారైనా ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు చేయాల్సి ఉంటుంది. కానీ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్‌దే ఇష్టారాజ్యం. ఆయన గీసిందే గీత.. వేసింది రోడ్డు అన్న పద్ధతిలో కొనసాగుతోంది. పనులు జరుగుతున్న సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులు మచ్చుకైనా కనిపించడం లేదు. దాంతో సిమెంటు రోడ్లలో వాడాల్సిన మెటీరియల్ సక్రమంగా వాడటం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చేసిన పనులు సైతం మున్నాల ముచ్చటగా యధాస్థితికి వస్తున్నాయి.నూతన రోడ్లపై సైతం నీటి నిల్వతో పూర్వపు స్థితిని గుర్తుచేస్తున్నాయి.
వృద్ధుల నరకం
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో గత నెల రోజులుగా సీసీ రోడ్డు వేసేందుకు ఉన్న మట్టి రోడ్డును పూర్తిగా తవేశారు. ఇండ్ల ముందున్న మెట్లను పూర్తిగా తొలగించారు. డ్రైనేజీ పైపులైన్లు ధ్వంసం అయ్యాయి. వెంటనే వేస్తామని చెప్పి సుమారు నెలరోజులవుతున్న పని కావడం లేదు. ఆ కాలనీలోని ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఇండ్ల ముందు రెండు మీటర్ల లోతు వేసుకోవాల్సిన మెట్లు తొలగిపోవడంతో వద్ధులు, మహిళలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎన్నిసార్లు సదరు కాంట్రాక్టర్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కమిషనర్‌కు కాలనీ వాసులు మొరపెట్టుకున్న పని ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం మేరకే పనులు కొనసాగే పరిస్థితి ఉండడంతో నరకం అనుభవిస్తున్నారు.